కుతకుతలాడుతున్న ప్రపంచం

భూగోళం వేడెక్కుతోందన్న శాస్త్రవేత్తల అంచనాలు నిజమవుతున్నాయి. గత నెలలో ప్రపంచం ఎన్నడూ లేనంతగా ఎండి వేడిమిని చవి చూసింది.

Updated : 17 Jul 2023 06:45 IST

కుదిపేస్తున్న ఎండ వేడిమి
అల్లాడుతున్న పలు దేశాలు
అమెరికాలో 54 డిగ్రీలకు చేరిక
ఫ్రాన్స్‌లో కరవు కాటకాలు

పారిస్‌: భూగోళం వేడెక్కుతోందన్న శాస్త్రవేత్తల అంచనాలు నిజమవుతున్నాయి. గత నెలలో ప్రపంచం ఎన్నడూ లేనంతగా ఎండి వేడిమిని చవి చూసింది. యూరోపియన్‌ యూనియన్‌ వాతావరణ పర్యవేక్షణ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా, జపాన్‌, ఐరోపాలోని దేశాలు కుతకుతలాడాయి. ప్రజలను అవెన్‌లో పెట్టి ఉడికించినట్లుగా ఎండలు ఇబ్బంది పెట్టాయి. ఈ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా రికార్డులను తిరగరాసే అవకాశముందని అంచనా. అయితే ఈ వేడికి ఏ ఒక్క అంశాన్నో కారణంగా చూపలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌, శిలాజ ఇంధనాలు అన్నీ కలగలిసి వేడిని మరింత పెంచుతున్నాయని చెబుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాలు, జపాన్‌లలో శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కోట్ల మంది ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌దాకా శక్తిమంతమైన వేడి గాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ వారం తీవ్రమైనది, ప్రమాదకరమైనదని పేర్కొంది. సాధారణంకంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారన్‌హీట్‌ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

అధిక ఎండలతో ఆరిజోనా రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పగటి సమయం అధికంగా ఉంటోంది. రాజధాని ఫీనిక్స్‌లో వరుసగా 16 రోజులపాటు 109 డిగ్రీల ఫారన్‌హీట్‌ (43 డిగ్రీల సెల్సియస్‌) కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 111 డిగ్రీలుగా ఉంది. అది క్రమంగా 115 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరుకోనుందని వాతావరణశాఖ వెల్లడించింది.

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు ఎండలతో అల్లాడిపోతున్నారు.

ఉత్తర కెనడాలో ఈ ఏడాది కోటి హెక్టార్లలో అడవులు దగ్ధమయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఇటలీలో చరిత్రలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోమ్‌సహా 16 నగరాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సోమవారం రోమ్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌, మంగళవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. 2007 ఆగస్టులో నమోదైన 40.5 డిగ్రీల రికార్డును ఈ సారి ఉష్ణోగ్రతలు తిరగరాసే అవకాశముందని పేర్కొంది.

ఐరోపాలోని సిసిలీ, శార్దీనియాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐరోపా అంతరిక్ష సంస్థ హెచ్చరించింది. ఇదే ఐరోపాలోని అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతని తెలిపింది.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గ్రీస్‌లోని ఎథెన్స్‌లో ఉన్న యాక్రోపొలిస్‌ను ఎండల కారణంగా మూసివేశారు.

ఫ్రాన్స్‌లో విపరీతమైన ఎండల కారణంగా కరవు తలెత్తే అవకాశముందని వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. గత నెల జూన్‌ ఫ్రాన్స్‌ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతల మాసంగా నిలిచింది.

స్పెయిన్‌లో సోమవారం నుంచి బుధవారం వరకూ 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్థానిక వాతావరణశాఖ వెల్లడించింది.

జపాన్‌లోనూ 39 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ సంస్థ తెలిపింది. గత రికార్డులను ఇవి తిరగరాస్తున్నాయని వెల్లడించింది.

ఎండల కారణంగా జోర్దాన్‌లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అయినా 214 టన్నుల నీటిని అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పడానికి వినియోగించాల్సి వచ్చింది.

ఇరాక్‌లోని టైగ్రిస్‌ నది ఎండిపోతోంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి.
కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. ఆదివారం అక్కడ 129 డిగ్రీల ఫారన్‌హీట్‌ (54 డిగ్రీల సెల్సియస్‌) నమోదైంది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పనులను వాయిదా వేసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. దక్షిణ కాలిఫోర్నియాలో 3వేల ఎకరాల్లోని అడవులు మంటల్లో కాలిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని