Zelenskyy: మిలిటరీ వేడుకపై దాడిలో 19మంది సైనికులు మృతి.. విచారణకు ఉక్రెయిన్‌ ఆదేశం

ఓ అవార్డుల వేడుకపై రష్యా జరిపిన దాడుల్లో తమ 19 మంది సైనికులు మృతి చెందిన ఘటనపై ఉక్రెయిన్‌ దర్యాప్తు ప్రారంభించింది.

Published : 07 Nov 2023 01:50 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ (Ukraine)లో ఇటీవల ఓ మిలిటరీ అవార్డుల వేడుకపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 19 మంది సైనికులు మృతి చెందడం తీవ్ర కలవరం రేపింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనను నివారించదగ్గ విషాదంగా పేర్కొన్నారు. జపోరిజియాలో యుద్ధక్షేత్రానికి సమీపంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడంపై స్థానికంగా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రక్షణశాఖ మంత్రి రుస్తెం ఉమెరోవ్‌ ఆదేశాల మేరకు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఇటీవల జపోరిజియాలో ‘రాకెట్ ఫోర్సెస్, ఆర్టిలరీ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవార్డుల వేడుకలో జకార్‌పట్టియాలోని 128వ ప్రత్యేక పర్వత ప్రాంత దాడుల బ్రిగేడ్‌ సైనికులు పాల్గొన్నారు. పెద్దఎత్తున మిలిటరీ సిబ్బందితో కిటకిటలాడిన ఈ కార్యక్రమంపై రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు నివారించేందుకుగానూ ఈ వ్యవహారంపై ఉక్రెయిన్‌ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సరిహద్దుకు సమీపంలో ఈ వేడుకను నిర్వహించారని పేర్కొన్న ఉన్నతాధికారులు.. దీనికి బాధ్యులైనవారిని గుర్తిస్తామని తెలిపారు.

నరమేధానికి నెల రోజులు.. భీకర యుద్ధంలో 11వేలు దాటిన మరణాలు

అంతకుముందు ఉక్రెయిన్‌ ఓడరేవు నగరం ఒడెసాపై మాస్కో జరిపిన డ్రోన్‌, క్షిపణి దాడుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. యునెస్కో వారసత్వ జాబితాలోని ఒడెసా ‘నేషనల్‌ ఆర్ట్‌ మ్యూజియం’ కూడా ఈ దాడుల్లో దెబ్బతింది. అనేక కళాఖండాలకు నెలవైన దీనికి 124 ఏళ్ల చరిత్ర ఉంది. అటు రష్యా ఆక్రమిత క్రిమియాలోని కెర్చ్‌ నగరంపై ఉక్రెయిన్‌ జరిపిన దాడుల్లో.. ఓ అత్యాధునిక యుద్ధనౌక ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగానే ఒడెసాపై మాస్కో సేనలు విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని