Pakistan: పాకిస్థాన్‌లో బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌పైనే దాడి..!

పాకిస్థాన్‌లో ఏకంగా బాంబు స్క్వాడ్‌పైనే ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మరణించారు.

Published : 01 Apr 2024 13:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan)లోని బలూచిస్థాన్‌లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆగడంలేదు. తాజాగా గ్వాదర్‌ పోర్టు సిటీ వద్ద బాంబు నిర్వీర్య దళంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంకరా డ్యామ్‌ వద్ద ల్యాండ్‌మైన్లను తొలగిస్తుండగా ఈ దాడి చోటు చేసుకొన్నట్లు డాన్‌ పత్రిక పేర్కొంది.

‘‘పోర్టుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు’’ అని గ్వాదర్‌ ఎస్‌ఎస్‌పీ మొహసీన్‌ జోహైబ్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత తీసుకోలేదు. ఈ ప్రాంతంలో బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) అనే వేర్పాటువాద సంస్థ పోరాడుతున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఇదే రేవుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడిలో ఏడుగురు తీవ్రవాదులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడికి బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) బాధ్యత వహించింది. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా జాతీయులు లక్ష్యంగా గతం వారం జరిగిన దాడిలో నలుగురు మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు