Israel: నలుగురు బందీలను కాపాడేందుకు.. 274 మందిని బలిగొని!

గాజాలో నలుగురు బందీలను కాపాడే క్రమంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 274 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.

Updated : 09 Jun 2024 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాలో ఉద్ధృత పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సెంట్రల్‌ గాజాలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నలుగురు బందీలను కాపాడినట్లు ఇజ్రాయెల్‌ (Israel) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో టెల్‌అవీవ్‌ దళాలు జరిపిన దాడుల్లో స్థానికంగా భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 274 మంది పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. మరో 700 మంది గాయపడ్డారని పేర్కొంది. బాధితుల హాహాకారాలతో అల్‌-అఖ్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు. ‘‘నుసిరత్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్‌లలో బందీలను ఉంచారు. వాటి మధ్య దాదాపు 200 మీటర్ల దూరం ఉంది. రెండు భవంతుల్లోకి మా బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. అయితే.. వారిపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్‌ గ్రనేడ్‌లు ప్రయోగించారు. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతిచర్యలు తీసుకున్నాం’’ అని వివరించారు.

హింసను ప్రోత్సహించడాన్ని ఏమాత్రం ఆమోదించం: కెనడా

గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. ఈక్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్‌ చేసి గాజాకు తరలించారు. నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్‌ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్‌ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్థ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో.. వారిని కాపాడటం టెల్‌అవీవ్‌కు సవాల్‌గా మారుతోంది. ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఓ ఆపరేషన్‌ నిర్వహించి, ఇద్దరు బందీలను కాపాడగా.. ఈ క్రమంలో 74 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని