China: ఏడాది పాటు ఆఫీసుకెళ్లకుండానే జీతం.. కంపెనీ లక్కీ డ్రాలో ఉద్యోగికి బంపరాఫర్‌

ఓ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ ఉద్యోగికి బంపరాఫర్‌ దక్కింది. ఏకంగా 365 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను ఆ ఉద్యోగి గెలుచుకున్నాడు.

Updated : 15 Apr 2023 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగులకు కంపెనీ పది రోజుల పాటు సెలవులు ఇస్తేనే ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఓ కంపెనీ తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులను ఇచ్చింది. దీంతో ఏడాది పాటు ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతడు నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. అదెలా అనుకుంటున్నారా..? అదంతా కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రా పుణ్యమే..! అదేంటో మీరూ చదివేయండి..!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రం షెన్‌జెన్‌ పట్టణంలోని ఓ కంపెనీ (పేరు వెల్లడించలేదు) కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఇటీవల వార్షిక విందును ఏర్పాటు చేసింది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తూ వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించడం కోసం ఆ విందులో లక్కీ డ్రాను నిర్వహించింది. ఓ గాజు కుండీలో కొన్ని చిట్టీలు రాసి డ్రా తీయమని ఉద్యోగులను కోరింది. అందులో అధిక వేతనం, పెనాల్టీలు, ఇతర బహుమతులతో పాటు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా చిట్టీలు రాసి పెట్టింది.

ఇందులో మేనేజర్‌ స్థాయిలో ఉన్న ఓ ఉద్యోగి ఏకంగా బంపర్‌ప్రైజ్‌ అందుకున్నాడు. డ్రాలో అతడు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవులను బహుమతిగా గెలుచుకున్నాడు. దీంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు. కంపెనీ అందించిన చెక్కును పట్టుకుని అతడితో పాటు ఓ మహిళ, ఇద్దరు పిల్లలు కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. దీనిపై అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి చెందిన చెన్‌ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. ఆ విజేత తన సెలవులను ఉపయోగించుకోవచ్చు. లేదంటే నగదుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉందని తెలిపారు. దీనిపై యాజమాన్యం అతడితో చర్చిస్తుందన్నారు.

ఇది చూసిన నెటిజన్లు తమ కంపెనీల్లో ఇలాంటి డ్రాను నిర్వహిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆ కంపెనీలో ఇంకా ఖాళీలు ఉన్నాయా? అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే చైనా నిబంధనలు గురించి తెలిసిన కొందరు మాత్రం.. అదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ అతడు ఏడాది తర్వాత తిరిగొస్తే.. అతడి స్థానంలో మరో వ్యక్తి ఉంటాడని, లేదంటే ఈ బంపరాఫర్‌కు అతడు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా.. ఇలా పని చేయకుండానే జీతం వస్తే ఎవరికైనా ఆనందమే కదా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని