Jaishankar: ఉగ్రవాది.. ఏ భాషలోనైనా ఉగ్రవాదే: జైశంకర్‌

రష్యాతో భారత్‌కు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.

Published : 25 Mar 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- రష్యా సంబంధాల (India- Russia Ties)పై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోతో దిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల సింగపూర్‌ పర్యటనలో ఉన్న జైశంకర్‌ ఆదివారం అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. చైనా వైపు రష్యా మళ్లుతుందనే భావననూ తోసిపుచ్చారు. అదే విధంగా.. ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదేనని, ఏ దేశం కూడా సొంత వివరణలతో దాన్ని సమర్థించకూడదన్నారు.

‘‘నా అనుభవాలు, లెక్కల ప్రకారం.. రష్యా ఎల్లప్పుడూ భారత్‌తో సానుకూల సంబంధాలు కలిగి ఉంది. ఇరు దేశాలూ పరస్పర ప్రయోజనాలను పట్టించుకునే విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నాయి. రెండింటి మధ్య ఈ మాత్రం విశ్వాసం అవసరం’’ అని జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఏ దేశంతో సంబంధాలనైనా భారత్‌ తన కోణం నుంచే చూడాలన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఆ తర్వాత వాషింగ్టన్‌తో భారత సమీకరణాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. భారత్‌ కలిసి మెలిసి ఉండగలదని చెప్పారు.

ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు: పాక్‌పై జైశంకర్‌ మండిపాటు

జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇది తాత్కాలిక నిబంధనేనని, దీని కారణంగా దేశానికి రెండు విధాల హాని కలిగిందని పేర్కొన్నారు. ‘‘ఒకటి.. వేర్పాటువాదం, హింస, ఉగ్రవాదానికి ఇది కారణమైంది. తద్వారా దేశ భద్రతకు సమస్యగా పరిణమించింది. రెండోది.. ఆ సమయంలో అనేక చట్టాలను ఈ ప్రాంతానికి విస్తరించకుండా నిరోధించింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి’’ అని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

మాస్కో ఉగ్రదాడి ఘటనపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో మాట్లాడినట్లు జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి పట్ల సంతాపం తెలియజేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మాస్కోలో జరిగిన దాడిలో ఇప్పటి వరకు దాదాపు 133 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే బాధ్యత స్వీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని