Seized Ship: నౌక స్వాధీనం ఘటన.. ఆ 17 మంది భారతీయ సిబ్బందికి ఇరాన్‌ ఊరట

Seized Ship: ఇరాన్‌ స్వాధీనం చేసుకొన్న నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతి లభించింది.

Updated : 15 Apr 2024 10:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel)తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక (Ship)ను ఇరాన్‌ (Iran) స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బంది (Indian Crew)కి టెహ్రాన్‌ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

గత శనివారం హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆదివారం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.

ఇరాన్‌పై ప్రతిదాడికి సహకరించబోం.. ఇజ్రాయెల్‌కు తేల్చి చెప్పిన అమెరికా!

ఈ పరిణామాల వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం దీనిపై ఓ ప్రకటన జారీ చేసింది. ‘‘స్వాధీనం చేసుకున్న నౌక వివరాలను తెలుసుకుంటున్నాం. త్వరలోనే అందులోని భారతీయ సిబ్బందిని న్యూదిల్లీ ప్రతినిధులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తాం’’ అని వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌక ఇరాన్‌ ప్రాదేశిక జలాల్లో ఉంది.

సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్‌ పనిగా భావించిన ఇరాన్‌ ప్రతీకార చర్యకు దిగిన సంగతి తెలిసిందే. ఆ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దళాల సాయంతో నేలకూల్చింది.  ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు మరింత తీవ్రంగా మారే ప్రమాదముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని