Al Qaida: కరడుగట్టిన అల్‌ ఖైదా ఉగ్రవాది మృతి.. అతడి తలపై రూ.40 కోట్ల రివార్డు

Al Qaida: అల్‌ ఖైదా యెమెన్‌ శాఖకు నాయకత్వం వహిస్తున్న ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందినట్లు ఆ ఉగ్రసంస్థ ప్రకటించింది. అతడి మృతదేహాన్ని చూపిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

Updated : 11 Mar 2024 09:48 IST

వాషింగ్టన్‌: ఉగ్రసంస్థ అల్‌-ఖైదా యెమెన్‌ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందినట్లు మిలిటెంట్ గ్రూప్‌ ఆదివారం ప్రకటించింది. అతడి మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అల్‌-ఖైదా (Al Qaida) జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపుతూ ఆదివారం ఓ వీడియో విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అతని వయసు 40 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా.

ఖలీద్‌ తలపై అమెరికా గతంలో దాదాపు రూ.40 కోట్ల రివార్డు ప్రకటించింది. అల్‌ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా యెమెన్‌ శాఖ అవతరించినట్లు చెబుతుంటారు. ఇకపై సాద్ బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఉగ్రసంస్థ తాజా వీడియోలో వెల్లడించింది. పలుసార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చిన కారణంతో అక్కడి ప్రభుత్వం ఇతడిపైనా దాదాపు రూ.50 కోట్ల రివార్డు ప్రకటించింది.

అమెరికాలో ఓ వాణిజ్య విమానాన్ని పేల్చివేసేందుకు అల్‌ ఖైదా యెమెన్‌ శాఖ 2009లో విఫలయత్నం చేసింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన దాడులు తమ పనే అని ప్రకటించింది. అప్పటి నుంచి అమెరికా ఈ గ్రూప్‌ను అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తూ వస్తోంది. 2020లో అమెరికా డ్రోన్‌ దాడిలో ఈ ఉగ్రసంస్థ నాయకుడు ఖాసీం అల్‌-రిమీ హతమయ్యాడు. అతడి నాయకత్వంలోనే సౌదీలోని అమెరికా నావికాస్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్‌ సైనికులు మరణించారు. అతడి మృతి తర్వాత ఖలీద్ అల్-బటర్ఫీ బాధ్యతలు తీసుకున్నాడు.

సౌదీ అరేబియాలో పుట్టిపెరిగిన ఖలీద్ అల్-బటర్ఫీ 1999లో అఫ్గానిస్థాన్‌కు మకాం మార్చాడు. అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్‌ఖైదాలో చేరాడు. యెమెన్‌లోని అబ్యాన్ ప్రావిన్స్‌ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా తెలిపింది. 2020లోనే అతడు అగ్రరాజ్య సైనికుల చేతికి చిక్కినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు