Alexei Navalny: కట్టుదిట్ట ఆంక్షల నడుమ.. నావల్నీ అంత్యక్రియలు పూర్తి

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

Updated : 01 Mar 2024 21:56 IST

మాస్కో: పుతిన్‌ విమర్శకుడు, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసుల కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ వేలాది మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ‘‘నావల్నీ.. నావల్నీ..’’, ‘‘మీరు భయపడలేదు, మేం కూడా బెదరలేదు!’’, ‘‘యుద్ధం వద్దు’’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శవపేటికను మాస్కోలోని చర్చికి తరలించి.. అనంతరం బోరిసోవ్‌స్కోయ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

నావల్నీ తల్లిదండ్రులు, అమెరికా రాయబారి లిన్ ట్రేసీ సహా పశ్చిమ దేశాల దౌత్యవేత్తలు, అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయాలని ఆశించిన బోరిస్ నదేజ్దిన్, యెకథెరినా దంత్సోవా తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అతడి భార్య, కుమార్తె, కుమారుడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. విదేశాలకు వెళ్లిపోయిన ఆయన రాజకీయ సన్నిహితులు యూట్యూబ్ ఛానెల్‌లో అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించినట్లు సమాచారం. మరోవైపు.. పెద్దఎత్తున గుమిగూడుతూ పౌరులు చట్టాన్ని ఉల్లంఘించవద్దని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.

నావల్నీ మృతదేహాన్ని తరలించేందుకు ముందుకురాని వ్యాన్‌ డ్రైవర్లు..!

ఫిబ్రవరి 16న ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో అలెక్సీ మరణించారు. మృతదేహాన్ని తీసుకోవడానికి తల్లి లియుడ్మిలా పట్టువీడకుండా ప్రయత్నాలు చేశారు. శుక్రవారం కూడా మృతదేహాన్ని అప్పగించేందుకు ఆలస్యం చేశారని ఆయన సన్నిహితుడు, అవినీతి నిరోధక ఫౌండేషన్ డైరెక్టర్ ఇవాన్ జ్దానోవ్ ఆరోపించారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహన డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. నావల్నీ మరణానికి గల కారణాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని