Moscow: నావల్నీ మృతదేహాన్ని తరలించేందుకు ముందుకురాని వ్యాన్‌ డ్రైవర్లు..!

రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని తరలించడంలో కూడా ఆయన కుటుంబసభ్యులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

Published : 01 Mar 2024 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ కుటుంబసభ్యుల కష్టాలు మరింత పెరిగాయి. అతడి మృతదేహాన్ని తరలించేందుకు వాహన డ్రైవర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని అతడి టీమ్‌ ప్రతినిధి కీరా యార్మిష్‌ వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా డ్రైవర్‌ ముందుకొస్తే వారికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

ఇప్పటికే నావల్నీ బృందం అతికష్టం మీద అంత్యక్రియలకు ఒక వేదికను సిద్ధం చేసుకోగలిగింది. తొలుత ఆయన బృందం చాలా వేదికలను సంప్రదించగా బిజీగా ఉన్నామని చెప్పటమో.. నావల్నీ పేరు చెప్పగానే నిరాకరించడమో చేశారు. గురువారమే ప్రజల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా అది సాధ్యం కాలేదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాస్కోలోని ది మదర్‌ ఆఫ్‌ గాడ్‌ చర్చిలో నావల్నీకి తుది వీడ్కోలు పలికి.. బోరిసోవ్‌ శ్మశానంలో సమాధి చేయనున్నారు. 

పుతిన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించే వ్యక్తిగా నావల్నీకి పేరుంది. ఆయనపై పలుమార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. 2021లో జర్మనీ నుంచి ప్రయాణిస్తున్న అతడిపై విషప్రయోగం చేశారు. రష్యాలో తయారయ్యే నొవిచోక్‌ అనే పదార్థాన్ని ఇందుకోసం వాడినట్లు గుర్తించారు. అతడికి జర్మనీలోనే చికిత్స చేశారు. తిరిగి రష్యాకు వచ్చిన వెంటనే అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత నుంచి బాహ్య ప్రపంచంలోకి రాలేదు. 

ఫిబ్రవరి 16వ తేదీన సైబీరియాలోని పీనల్‌ కాలనీలో నావల్నీ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన చాలా ప్రయత్నాలు తొలుత విఫలమయ్యాయి. ఆయన మరణవార్త అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో ఉన్న జైలుకు వెళ్లారు. అక్కడ కూడా ఆమెను అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. నావల్నీ భార్య యూలియా మాట్లాడుతూ తన భర్త మరణం వెనక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపించారు. బుధవారం ఐరోపా పార్లమెంట్‌లో ఆమె ప్రసంగించారు. అతడికి మృతికి కారకులుగా అనుమానిస్తున్న వారిపై అమెరికా, పశ్చిమదేశాలు ఆంక్షలు విధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని