నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌ అభ్యర్థన వెనక స్టార్‌ హీరో సతీమణి

ఇజ్రాయెల్ ప్రధాని సహా హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్‌ డెయిఫ్, ఇస్మాయిల్‌ హనియాపైనా అరెస్టు వారెంట్‌ జారీ చేయాలంటూ ఐసీసీలో పిటిషన్ దాఖలైంది. దీని వెనక ఒక స్టార్‌ హీరో సతీమణి ఉన్నారు. 

Updated : 21 May 2024 17:57 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి(ICC) అభ్యర్థన దాఖలైన సంగతి తెలిసిందే. దీని వెనక ఒక హీరో సతీమణి కీలకపాత్ర పోషించారు. ఆమె అందించిన సహకారం ఆధారంగానే ప్రధాన ప్రాసిక్యూటర్ పిటిషన్ వేశారు. ఆయనకు సహకరించిన నిపుణుల బృందంలో ఆమె కూడా ఒకరు. 

అమెరికాకు చెందిన నటుడు, ఫిల్మ్‌మేకర్ జార్జ్‌ క్లూనీ సతీమణి పేరు అమల్‌ క్లూనీ(Amal Clooney). ఆమె బ్రిటిష్‌- లెబనీస్‌ సంతతికి చెందిన ప్రముఖ బారిస్టర్. ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. అరెస్ట్‌ వారెంట్‌ కోసం ఐసీసీకి అభ్యర్థన వచ్చిన సమయంలో క్లూనీ ఫౌండేషన్ ఫర్ జస్టిస్‌ వెబ్‌సైట్‌లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌, గాజాలో అనుమానిత యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘోరాలకు సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించేందుకు తమ బృందంలో చేరమని కరీమ్‌ ఖాన్‌ అడిగారని ఆమె వెల్లడించారు. తమ నేపథ్యాలు వేరైనప్పటికీ.. చట్టపరంగా గుర్తించిన విషయాల్లో మాత్రం ఎటువంటి వైరుధ్యం లేదన్నారు. బందీలను తీసుకెళ్లడం, హత్య చేయడం, లైంగికంగా వేధించడంలో హమాస్‌ నేతలు నిమగ్నమై ఉన్నారని నమ్మేందుకు సహేతుకమైన కారణాలున్నాయన్నారు. అదే సమయంలో యుద్ధ వ్యూహంగా ఆకలి మంటల్ని ఉపయోగిస్తున్నారని విశ్వసించేందుకు తగిన ఆధారాలున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని గురించి వ్యాఖ్యానించారు. యుద్ధ నేరాలపై ఐసీసీ విచారణకు మద్దుతుగా నిపుణుల బృందం అంతర్జాతీయ మీడియాకు ఒక ఆర్టికల్‌ను కూడా రాసింది.

గాజాలో మరణాలపై అమల్‌ మాట్లాడటం లేదని ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడేమో అందుకు భిన్నమైన స్పందన వస్తోంది. ‘‘నేను చేస్తున్న దానిని రన్నింగ్ కామెంట్రీ ఇవ్వడం నా పని కాదు. నా పనే మాట్లాడుతుంది. చట్టపాలనపై ఉన్న విశ్వాసం, పౌరుల ప్రాణాలను రక్షించాల్సిన అవసరమే ఈ ప్యానెల్‌లో పని చేసేందుకు కారణమైంది. యుద్ధ సమయాల్లో పౌరుల్ని రక్షించేందుకు 100 సంవత్సరాల క్రితమే చట్టం ఉంది. ఘర్షణకు కారణమేదైనా..ఈ చట్టం అన్ని దేశాలకు వర్తిస్తుంది’’ అని స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని