USA: టెక్సాస్‌ను కమ్ముకొన్న కార్చిచ్చు.. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన..!

అమెరికాలో కార్చిచ్చులు విజృంభించాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూమిలో పచ్చదనాన్ని భస్మం చేశాయి. 

Published : 28 Feb 2024 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA)లోని టెక్సాస్‌ (Texas) రాష్ట్రం దావాగ్నుల్లో చిక్కుకొంది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చులకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో చూస్తుండగానే రెండింతలయ్యాయి. వీటిల్లో పెద్దదాన్ని స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం చాలా చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2,00,000 ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించివేశాయి. స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ లక్ష ఎకరాలను, గ్రేప్‌వైన్‌ క్రీక్‌ ఫైర్‌ 30,000 ఎకరాలను, విండీ డ్యూసీ ఫైర్‌ 8,000 ఎకరాలను భస్మం చేశాయి. టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం ఫారెస్ట్‌ సర్వీస్‌ ఈ కార్చిచ్చుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. రాష్ట్ర ఉత్తర భాగంలోని ఇరుగ్గా ఉండే ప్రాంతంలో ఈ అగ్ని వ్యాపించడంతో తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. 

సముద్రగర్భ కేబుళ్లపై హూతీల దాడి!

‘‘రాష్ట్ర ప్రజలు తమ కార్యక్రమాలను తగ్గించుకోవాలి.. అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయులను రక్షించుకోవాలి’’ అని గవర్నర్‌ అబాట్‌ సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో కూడా మంటలు అంటుకొన్నట్లు తమకు సమాచారం వస్తోందని అధికారులు తెలిపారు. హెంప్‌హిల్‌, రాబర్ట్స్‌ కౌంటీ, కెనేడియన్‌టౌన్‌ నివాస ప్రాంతాల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారుల పక్కన కూడా అగ్నికీలలు ఎగసి పడుతుండటంతో మూసివేశారు. 

టెక్సాస్‌ నుంచి ఈ కార్చిచ్చులు ఓక్లహామాకు పాకాయి. అక్కడ రెండు కౌంటీల్లో ఉంటున్న ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. ‘‘రోజర్‌ మిల్స్‌, ఎల్లిస్‌ కౌంటీల్లోని ప్రజలను తరలిస్తున్నాం’’ అని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు