Boeing: కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు.. మరో బోయింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు గుర్తించడంతో మరో బోయింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ అయింది. ఈ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది.

Published : 14 Jan 2024 12:33 IST

టోక్యో: అమెరికాలో గత వారం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ ప్లగ్‌ గగనతలంలో ఊడిపోయిన తర్వాత.. బోయింగ్ 737 మ్యాక్స్‌లను అన్ని దేశాలు పక్కన పెట్టేశాయి. కానీ, ఆ సంస్థకు చెందిన ఇతర విమానాల్లో లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. శనివారం జపాన్‌లో ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 737-800 కాక్‌పిట్‌ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారని సంస్థ తెలిపింది.

‘‘సపోరో-న్యూ చిటోస్‌ నుంచి తొయామకు బయల్దేరిన ఫ్లైట్‌ 1182 గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే.. నాలుగు లేయర్లు కలిగిన కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వెలుగు చూశాయి. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది బోయింగ్‌ 737 మ్యాక్స్ 9 శ్రేణిలోనిది కాదు’’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి?

అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. తాజాగా వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. మరిన్ని భద్రతా పరీక్షల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ దీనిపై దృష్టి పెట్టింది. అత్యవసర ద్వారాలను తక్షణమే తనిఖీ చేయాలని దేశీయ ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు గత వారం మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్‌ (22), స్పైస్‌ జెట్‌ (9), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) నడుపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని