Canada: కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి?

Canada: కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య అదుపు తప్పిందని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమాలోచనలు జరపనున్నట్లు వెల్లడించారు.

Updated : 14 Jan 2024 10:27 IST

ఒట్టావా: కెనడాలో (Canada) నిరుద్యోగం, ఇళ్ల కొరత పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. దేశంలో నివసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ శనివారం వెల్లడించారు.

దీనిపై త్వరలోనే కెనడా (Canada) కేంద్ర సర్కార్‌ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించనున్నట్లు మిల్లర్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ అంశాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పి పెద్ద ఎత్తున విదేశీ విద్యార్థులు వచ్చి చేరారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. పరిమితి ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేమన్నారు. చాలా విద్యాసంస్థల ఆదాయ వనరులపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

కెనడా (Canada) ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని మిల్లర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి సగటు వయసును తగ్గించాలని వస్తున్న డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అక్కడి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున వలసదారులను స్వాగతించడంపై గతకొంత కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార లిబరల్‌ పార్టీ ఈ ఏడాది 4.85 లక్షల మంది విదేశీయులను అనుమతించాలని నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో మరో పది లక్షల మందిని దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమైంది.

ఇలా భారీ ఎత్తున విదేశీయులను అనుమతించటంపై అక్కడి ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని రెండేళ్ల క్రితమే హెచ్చరించినట్లు స్థానిక మీడియా ఛానల్‌ ‘సీటీవీ’ పేర్కొంది. దీన్ని అదుపు చేయకపోతే ఇళ్ల కొరత పెద్ద సంక్షోభంగా మారుతుందని నివేదిక సమర్పించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని