Pakistan: పాక్‌, అఫ్గానిస్థాన్‌లో హిమపాతం.. డజన్ల సంఖ్యలో మృతులు

పాకిస్థాన్‌లో ఇటీవల కురిసిన మంచు.. వడగళ్ల వాన డజన్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా సహాయక చర్యలు చేపట్టేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. 

Published : 05 Mar 2024 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌(Pakistan)లో ఇటీవల భారీగా హిమపాతం కురిసింది. అదే సమయంలో వడగళ్ల వాన పడింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 36కి చేరింది. మరో 43 మంది గాయపడ్డారని డాన్‌ పత్రిక పేర్కొంది. మృతుల్లో 22 మంది వరకు చిన్నారులున్నారు. చాలామంది మంచుపెళ్లల కింద చిక్కుకుపోయి చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చిలో పాక్‌ పశ్చిమ, ఉత్తర భాగాల్లో వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుంది. పర్యావరణ మార్పుల్లో భాగంగానే ఇలా జరిగినట్లు వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ముస్తాక్‌ అలీషా వెల్లడించారు. కొన్ని క్షణాలపాటు వడగళ్ల వాన పడటం సాధారణమే. కానీ, ఈసారి 30 నిమిషాలపాటు అది కొనసాగడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొన్నారు. బజౌర్‌, మలనకండ్‌, స్వాత్‌, ఖైబర్‌, పెషావర్‌, లక్కీ మర్వాత్‌, చిత్రాల్‌, మర్డాన్‌ ప్రాంతాల్లో దీని తీవ్రత నమోదైంది. బజౌర్‌లో అధికారులు నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం మొదలుపెట్టారు. 

గత 25 ఏళ్లలో ఖైబర్‌ ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే హిమపాతం చూశామని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వడగళ్ల వాన కారణంగా ఖైబర్‌, బలోచిస్థాన్‌ ప్రావిన్సుల్లో 150 ఇళ్లు ధ్వంసం కాగా.. దాదాపు 500 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ కొన్ని జిల్లాలకు విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 

ఇక అఫ్గానిస్థాన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ 39 మంది మరణించగా.. మరో 30 మంది గాయపడినట్లు సమాచారం. దీనిపై అక్కడి విపత్తు ప్రతిస్పందన నిర్వహణశాఖ ప్రతినిధి జనాన్‌ సయిక్‌ మాట్లాడుతూ 637 ఇళ్లు కూలిపోగా.. 14,000 పశువులు మరణించాయన్నారు. 

సులేమానీపై దాడికి ప్రతీకారం కోసం అమెరికాలోకి ఇరాన్‌ ఏజెంట్లు.. ఎఫ్‌బీఐ వేట..!

2022లో పాకిస్థాన్‌లోని ప్రముఖ హిల్‌స్టేషను ముర్రేలో భారీగా మంచు కురిసి 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని ఒక్క రాత్రిలోనే నాలుగు అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని