FBI: సులేమానీపై దాడికి ప్రతీకారం కోసం అమెరికాలోకి ఇరాన్‌ ఏజెంట్లు.. ఎఫ్‌బీఐ వేట..!

ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకొనేందుకు తన ఏజెంట్లను అమెరికాలోకి పంపింది. ఈ విషయాన్ని అక్కడి ఎఫ్‌బీఐ కనిపెట్టింది.  

Published : 05 Mar 2024 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖుద్స్‌ ఫోర్స్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇరాన్‌ (Iran) చేసిన యత్నాలను  అమెరికా భద్రతా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) పసిగట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌గా పనిచేసిన మైక్‌ పాంపియో, ట్రంప్‌ తరఫున టెహ్రాన్‌ దూతగా పనిచేసిన బ్రయాన్‌ హుక్‌ను లక్ష్యంగా చేసుకొన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్‌ ఏజెంట్‌ మాజిద్‌ దస్తజాని ఫర్హానీ అనే వ్యక్తి కొందరు హంతకులను నియమించుకొన్నట్లు గుర్తించింది. ధారాళంగా స్పానిష్‌ మాట్లాడే ఫర్హానీ గురించి గత వారం మియామీలోని ఎఫ్‌బీఐ ఆఫీసు సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. అతడు తరచూ ఇరాన్‌, వెనుజువెలా మధ్య ప్రయాణించినట్లు గుర్తించింది. టెహ్రాన్‌ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్లు పేర్కొంది. ఇరాన్‌ టార్గెట్‌ చేసుకొన్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది. డిసెంబర్‌లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆంక్షలు కూడా విధించింది. 

ఫర్హానీ లక్ష్యంలోని వారి కదలికలను గుర్తించేందుకు వీలుగా ప్రార్థనా మందిరాలు, వ్యాపారాలు, ఇతర కార్యాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడు ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. 

2020 జనవరిలో సీఐఏ డ్రోన్‌ ఒకటి ఇరాన్‌ జనరల్‌ సులేమానీ కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు మరణించాడు. నాడు ప్రతీకారం తీర్చుకొంటామని ఇరాన్‌ ప్రతిజ్ఞ చేసింది. దీనిలో భాగంగానే నాటి సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను లక్ష్యంగా చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయనకు ముప్పు పెరిగిన విషయాన్ని గతంలోనే గుర్తించిన అమెరికా ప్రభుత్వం 24 గంటలపాటు రక్షణ కల్పిస్తోంది. 

ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి

ట్రంప్‌ హయాంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్‌ బోల్టన్‌ను కూడా హత్య చేసేందుకు 2022లో ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ కీలక అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని