Greg Ross: సీఈవో ఉద్యోగాన్ని వదులుకొని.. ట్రక్కు డ్రైవర్‌గా చేరి..!

ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ రాస్‌ అనే వ్యక్తి సీఈవో ఉద్యోగానికి రాజీనామా చేసి ట్రక్కు డ్రైవర్‌గా జీవితం ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఆయన అలాగే సాధారణ జీవనం సాగిస్తున్నారు.

Updated : 13 Jul 2023 18:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆయన ఓ సినిమాహాళ్ల సంస్థకు సీఈవో. అప్పటికే 60 ఏళ్లు. ఈ వయసులో సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు ఎవరైనా వెనకాడతారు. మంచి జీతం, హోదాలను వదిలిపెట్టి సాధారణ జీవితం గడపాలని కోరుకోరు. కానీ, అస్ట్రేలియాకు (Australia) చెందిన గ్రెగ్‌ రాస్‌ (Greg Ross) అనే వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రక్కు డ్రైవర్‌గా జీవితం ప్రారంభించారు. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు.

గ్రెగ్‌ రాస్‌.. గతంలో విలాసవంతమైన కార్లు విక్రయించే సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అప్పట్లోనే జీవితంలో ఏదో కోల్పోయామన్న భావన, అలసత్వం ఆయన మనసులో అలముకున్నాయి. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాలేదు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా సేవలందించే స్థాయి వరకు ఎదిగారు. గౌరవప్రదమైన జీతం, హోదా, సకల సౌకర్యాలు. ఇలా ఎన్ని ఉన్నా.. ఆయన మనసులో ఏదో వెలితి. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా గడపాలనుకున్నాడు. పిల్లలు కూడా స్థిరపడటంతో కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ, అప్పటికే ఆయనకు 60 ఏళ్లు నిండాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి, ట్రక్కు డ్రైవర్‌గా పని చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్తే..వాళ్లు ససేమిరా అన్నారు. కానీ, రాస్‌ మాత్రం పట్టు వదల్లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కొన్ని రోజులకు ఆ కంపెనీ నుంచి ఫోన్‌ వచ్చింది. దరఖాస్తులో గత అనుభవం పేర్కొనక పోవడంతో ఆ సంస్థ సిబ్బంది దాని గురించి ప్రశ్నించారు. గ్రెగ్‌ రాస్‌ తన గతం గురించి వారికి వివరించారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది.. కేవలం రాత్రిపూట మాత్రమే ట్రక్కు నడిపేందుకు అనుమతిచ్చారు. అతడి డ్రైవింగ్‌ చూసి పగలు కూడా నడిపేందుకు అవకాశం ఇచ్చారు. క్రమంగా రెగ్యులర్‌ ఉద్యోగిగా నియమితులైన గ్రెగ్‌ రాస్‌... ప్రస్తుతం పెద్ద పెద్ద ట్రక్కులు సైతం అవలీలగా డ్రైవ్‌ చేస్తున్నారట. ఐదు ట్రైలర్లతో 190 అడుగుల పొడవు, రెండు ఇంజిన్లు, 480 టన్నులను మోసుకెళ్లగలిగే సామర్థ్యమున్న ట్రక్కును నడపడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.

గ్రెగ్‌ రాస్‌కు ప్రస్తుతం 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్ థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్‌ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. ట్రక్కు డ్రైవర్‌గా జీవించడం సాహసమనే చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని