Odisha police pigeon : ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!
భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే ఒడిశా (Odisha) పోలీసు విభాగంలో కొన్ని పావురాలు పని చేస్తున్నాయి. వాటి సేవలను ఎలా వినియోగించుకున్నారో తెలుసుకోండి.
భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal nehru) 1948 ఏప్రిల్ 13న ఒడిశా రాష్ట్రం (Odisha) సంబల్‌పూర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ్నుంచి ఆయన 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ వెళ్లాలనుకున్నారు. తన పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కటక్ అధికారులకు ఒక అత్యవసర సందేశం పంపించాల్సి వచ్చింది. ఎలా అని నెహ్రూ వాకబు చేస్తుండగా.. స్థానిక పోలీసులు ఓ పావురాన్ని తీసుకొచ్చి దాంతో ఆ సందేశం పంపిస్తామని చెప్పారు. ఆయన ఎగాదిగా చూసి అప నమ్మకంగానే దాంతో వర్తమానం పంపించారు. ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన ఆ పావురం 11.20 కల్లా కటక్ చేరింది. అది తెచ్చిన సందేశంలో సూచించిన ప్రకారం వెంటనే అక్కడ చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. మధ్యాహ్నం తరువాత కటక్ వెళ్లిన ప్రధాని ఆ పావురాన్ని, తాను రాసిన సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. ఆనందించారు. అంతటి గొప్ప ఘన చరిత్ర కలిగిన పోలీసు పావురాల నైపుణ్యం, వాటి సేవల గురించి తెలుసుకోండి మరి.
రెండు కేంద్రాల్లో పెంపకం
ఒడిశా రాష్ట్రం పోలీసు విభాగంలో కొన్ని దశాబ్దాలుగా పావురాలు పని చేస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో వాటి సేవలను వినియోగించుకున్నారు. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు ఇలా వివిధ సందర్భాల్లో అవి ముఖ్యమైన సందేశాలను చేరవేశాయి. ఇప్పటికీ కటక్‌లోని ఒడిశా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 105, అనుగుల్ పోలీసు శిక్షణ కళాశాలలో 44 హోమర్ రకం పావురాలను పెంచుతున్నారు.
బ్రిటిష్ హయాంలో ప్రారంభం
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1946వ సంవత్సరంలో ఒడిశాలో పావురాల సేవలను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వాటిని వార్తా వాహినులుగా అనేక సందర్భాల్లో వినియోగించారు. 1954లో దిల్లీలో ఇంటర్నేషనల్ పోస్టల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అప్పట్లో ఈ పావురాలు ప్రదర్శించిన నైపుణ్యాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1982లో ఒడిశాలో భారీ వరదలు వచ్చాయి. దాంతో అనేక చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ సమయంలోనూ పావురాలు ఎంతో కచ్చితత్వంతో సందేశాలను చేరవేసి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించాయి.
నక్సల్స్ కదలికలు తెలుసుకునేందుకు..
ఒడిశా రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువ. కొరాపుట్ జిల్లాలో వారి కదలికలను తెలుసుకొనేందుకు తొలిసారి కపోతాలతో ప్రయోగం చేశారు. అది విజయవంతం కావడంతో తరువాత 38 ప్రాంతాల్లో 1500 పావురాలను మోహరించారు. వివిధ జిల్లాల్లో 19 పావురాల కేంద్రాలను నెలకొల్పారు. ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్సైలు, ఒక ఏఎస్సై, 35 మంది కానిస్టేబుళ్లను వాటి కోసం కేటాయించారు. 1990 నుంచి వైర్‌లైస్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వంటి కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పావురాల వినియోగం తగ్గింది.
పోలీసులతో శిక్షణ
పావురాలు చాలా తెలివైనవి. వాటి చూపు తీక్షణంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి అవి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక సారి ఎగరడం మొదలుపెడితే 400 నుంచి 500 కిలోమీటర్ల దాకా ఆగవు. పావురాల పిల్లలు.. 4 నుంచి 6 వారాల వయసు రాగానే ఎగరడం నేర్చుకుంటాయి. ఆ సమయంలో అనుభవజ్ఞులైన పోలీసులు వాటికి శిక్షణనిస్తారు. అన్ని దిక్కులా.. 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టి తిరిగి గూటిని చేరుకునే నైపుణ్యం వాటికి అలవాటు చేస్తారు. దాంతో అవి పరిసరాలు, మార్గాలను మననం చేసుకుంటాయి. ప్రాథమిక శిక్షణ పూర్తయిన తరువాత కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వదిలి.. అవే తిరిగొచ్చేలా చూస్తారు. అలా క్రమంగా దూరం పెంచుతూ పోతారు. శిక్షణా కాలంలో వాటికి బలవర్థకమైన ఆహారం, పానీయాలు అందజేస్తారు. అందువల్ల అవి బయట ఎక్కడా తినవు... తాగవు. పోలీసు శిక్షణ పొందిన కపోతం 7 నుంచి 12 ఏళ్లపాటు సేవలందిస్తుంది.
కాగ్ అభ్యంతరం తెలిపినా..
2008 మార్చి 31న పావురాల సందేశ సేవలను నిలిపివేశారు. కానీ, వాటిని పెంచడం, శిక్షణ ఇవ్వడం మాత్రం ఆపలేదు. ఈ ఆధునిక కాలంలో వాటిపై పెట్టే ఖర్చు అనవసరమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కొన్నేళ్ల కిందటే అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ, సీఎం నవీన్ పట్నాయక్ పావురాల శిబిరాలను కొనసాగించడానికే మొగ్గు చూపారు. కొన్ని ముఖ్యమైన సందేశాలు పంపించిన ఈ పావురాల ఘన వారసత్వం గురించి ప్రపంచానికి తెలియాలనేది ఆయన ఉద్దేశం. అందుకే రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల నాడు వాటితో ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
కపోతాలతో మూడు రకాల సేవలు
స్టాటిక్ : ఈ రకం సేవలో పావురాలు లక్షిత గమ్యం వైపు మాత్రమే ప్రయాణం చేస్తాయి. తుపానులు, వరదలు సంభవించిన సమయంలో వాటిని వినియోగిస్తారు.
బూమ్‌రాంగ్ : ఈ విధానంలో ఒక చోట నుంచి బయలుదేరిన పావురం నిర్దేశిత ప్రాంతంలో సందేశం చేరవేసి తిరిగి యథా స్థానానికి రావాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో ఇవి వెళ్లాల్సిన చోట ఆహారం, తిరిగి రావాల్సిన ప్రదేశంలో తాగునీరు ఉంచుతారు.
మొబైల్ : అవసరాన్ని బట్టి పోలీసు బలగాలు పావురాలను తమ వెంట తీసుకెళ్తాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను వాటి ద్వారా హెడ్‌క్వార్టర్‌కు నివేదిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!
-
Nara Lokesh: అప్పటి వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఆదేశం