Baltimore Incident: బాల్టిమోర్‌ వంతెన ఘటన.. ‘అమెరికా ఆర్థిక విపత్తు’

అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటనతో స్థానిక నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ తెలిపారు.

Published : 01 Apr 2024 00:05 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని (USA) బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటన (Baltimore Bridge Collapse)తో స్థానిక నౌకాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయని మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ తెలిపారు. ఈ పరిణామాలు కేవలం బాల్టిమోర్‌, మేరీల్యాండ్‌లపైనే కాకుండా మొత్తం అమెరికాపైనా ఆర్థికపరంగా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా పేర్కొన్నారు.

‘ఈ ఓడరేవు దేశాభివృద్ధిలో కీలకం..’

‘‘అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో బాల్టిమోర్‌ ఒకటి. గతేడాది ఇక్కడి నుంచి 11 లక్షల కంటెయినర్లు వెళ్లాయి. కార్లు, ట్రక్కులు, వ్యవసాయ పరికరాల ఎగుమతులకు దేశవ్యాప్తంగా ఇదే అతిపెద్ద ఓడరేవు. ప్రస్తుతం కార్యాకలాపాలు నిలిచిపోవడంతో.. దీని ప్రభావం కేవలం మేరీల్యాండ్‌కే పరిమితం కాదు. కెంటకీలో వ్యవసాయదారులు, ఒహైయోలో ఆటో డీలర్లు, టెనస్సీలో రెస్టారంట్‌లపైనా ప్రభావం పడుతుంది. ఈ నౌకాశ్రయం దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకం. అందుకే వీలైనంత త్వరగా రాకపోకలు పునరుద్ధరించడం అవసరం’’ అని వెస్‌ మూర్‌ తెలిపారు.

అమెరికాలో వంతెనను ఢీకొన్న బార్జ్‌..!

వంతెన శకలాలను తొలగించేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వెయ్యి టన్నుల బరువు ఎత్తగల భారీ క్రేన్‌ను రప్పించినట్లు మూర్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన నౌకపైనా దాదాపు నాలుగు వేల టన్నుల బరువైన వంతెన శకలాలు ఉన్నాయని, దీంతో అది అక్కడే చిక్కుకుపోయిందన్నారు. దాదాపు ఈఫిల్‌ టవర్‌ అంత పొడవైన ఆ నౌక (984 అడుగులు)ను తరలించడం ప్రస్తుతం అత్యంత సవాల్‌తో కూడుకున్న పని అని చెప్పారు. మరోవైపు.. ‘నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)’ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు.

నౌకాసిబ్బంది అప్రమత్తత భేష్‌..

నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం.. మార్చి 25న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. నౌకలో భారత సిబ్బంది ఉన్నారు. అయితే.. ప్రమాదానికి ముందే వారు అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని వెస్‌ మూర్‌ తెలిపారు. లేకపోతే.. ఆ చీకట్లో వంతెన కూలిపోయిన తర్వాత కూడా వాహనాలు దూసుకొచ్చి నీళ్లలో పడిపోయేవన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం భారత సిబ్బందిపై ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని