Netanyahu: సొంత సైన్యంపై నెతన్యాహూ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు

హమాస్‌తో యుద్ధం వేళ ఇజ్రాయెల్‌ సైనిక దళాలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని నెతన్యాహూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. 

Updated : 29 Oct 2023 18:55 IST

టెల్‌ అవీవ్‌: హమాస్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే హమాస్‌ కీలక కమాండర్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ దళాలు ప్రకటించాయి. మరోవైపు తాము రెండో దశ యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతా బలగాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అక్టోబరు 7న హమాస్‌ దాడిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని, భద్రతాధికారులు దాడి గురించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని నెతన్యాహూ ట్వీట్ చేశారు. దీనిపై కేబినెట్ సహచరులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. భద్రతా బలగాలకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్న ఆయన, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. 

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలపై నింద మోపుతూ.. ప్రధాని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. హమాస్‌, హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (IDF) పోరాడుతున్నాయి. వాళ్లకు మద్దతుగా ఉండాల్సిన సమయంలో, సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు’’ అని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యైర్‌ లాపిడ్‌ అన్నారు. 

గాజాలో ఆకలి కేకలు.. గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు

ఆసుపత్రి సమీపంలో దాడులు

మరోవైపు గాజాలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఆల్‌-షిపాకు అతి సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు చేసింది. హమాస్‌ ఉగ్ర కార్యకలాపాలకు ఆసుపత్రిని ప్రధాన కార్యాలయంగా వాడుకుంటోందని ఇజ్రాయెల్‌ ఆరోపించిన కొద్ది గంటల్లోనే అక్కడికి సమీపంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆసుపత్రికి వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 వేలకు చేరిందని గాజాలోని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడులతో పాలస్తీనాలో పాలనా వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని