Gaza: గాజాలో ఆకలి కేకలు.. గోదాముల్లో చొరబడుతోన్న వేల మంది నిస్సహాయులు

అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది.

Updated : 29 Oct 2023 19:59 IST

గాజా: గాజాను నిర్బంధించిన ఇజ్రాయెల్‌ దళాలు.. భూతల దాడులను ఉద్ధృతం (Israel Hamas Conflict) చేశాయి. దీంతో దేశం విడిచి బయటకు వెళ్లలేక.. అక్కడ సురక్షితంగా తలదాచుకోలేక 23 లక్షల మంది గాజా ప్రజలు మూడు వారాలుగా నలిగిపోతున్నారు. ముఖ్యంగా అన్నపానీయాలతోపాటు ఇతర అత్యవసర సామగ్రి లేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వీరికి సాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాంలలోకి వేల మంది నిస్సహాయులు చొరబడి.. ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది.

ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య జరుగుతోన్న పోరు.. మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న వేల మంది గాజావాసులకు అత్యవసర వస్తువులను పాలస్తీనాలోని ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ, మానవతా విభాగం (UNRWA) అందిస్తోంది. దాని ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను వసతి గృహాలుగా మార్చింది. వీటిల్లో వేల సంఖ్యలో పునరావాసం పొందుతున్నారు. అయితే, ఇరువైపుల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న గాజావాసుల కోసం ఈజిప్టు నుంచి పరిమిత స్థాయిలో సాయం అందుతోంది. ఈ క్రమంలో దీన స్థితిని ఎదుర్కొంటున్న వేలాది మంది నిస్సహాయులు.. గోదాంలలోకి చొరబడి గోధుమలు, పిండి, ఇతర నిత్యవసర వస్తువులు తీసుకెళ్లినట్లు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వెల్లడించింది.

ఇది ఇజ్రాయెల్‌ ఉనికికి పరీక్ష: ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు

ఇలా గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని.. స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజా డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నారు. భయం, ఆందోళన, నిరాశతో ఉన్న గాజావాసుల్లో ఓపిన నశిస్తుందనడానికి ఇది అద్దం పడుతోందన్నారు. ఈజిప్టు నుంచి ట్రక్కుల్లో వస్తోన్న మానవతాసాయం సరిపడ స్థాయిలో లేదని.. మార్కెట్లో వీటి నిల్వలు నిండుకుంటున్నాయని అన్నారు. మరోవైపు ప్రత్యేక షెల్టర్లు కిక్కిరిసిపోతున్నాయని.. ఒక్కో షెల్టర్లో సాధారణం కంటే 12 రెట్లు ఎక్కువ జనం తలదాచుకుంటున్నారని అన్నారు.

రక్తపాతానికి ముగింపు పలకండి..!

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మరోసారి విజ్ఞప్తి చేశారు. గాజాలో పరిస్థితులు గంట గంటకు క్షీణిస్తున్నాయని.. అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన వేళ ఇజ్రాయెల్‌ సైనిక దాడులు పెరగడం పట్ల చింతిస్తున్నానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని