Israel Hamas war: సోమవారానికి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య సంధి: బైడెన్‌

Israel Hamas war: గాజాలో సైనికపోరును కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌తో హమాస్‌ వచ్చే వారం రోజుల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వెల్లడించారు.

Updated : 27 Feb 2024 08:19 IST

న్యూయార్క్‌: గాజాలో ఇజ్రాయెల్‌, హమాస్ (Israel Hamas war) మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తెలిపారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు.

ఇరు పక్షాల మధ్య సంధిలో భాగంగా.. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్‌ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాలి. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారి కోసం సహాయ సామగ్రితో వందలాది ట్రక్కులను కూడా లోపలికి అనుమతించాలి. దాదాపు ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగొచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై హమాస్‌ మినహా వివిధ పక్షాలకు చెందిన ప్రతినిధులు గతవారం ప్యారిస్‌లో సమావేశమైనట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్ వెల్లడించారు. సంధి ఖరారుకు అడ్డంకిగా ఉన్న అంశాలు చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఈజిప్టు, ఖతర్‌, అమెరికా నిపుణులు ఇజ్రాయెల్‌, హమాస్‌ ప్రతినిధులతో భేటీ అయినట్లు కైరో అధికారిక మీడియా వెల్లడించింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌కు ముందే ఒప్పందానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

కాల్పుల విరమణ ఒప్పందం ఖరారులో వివాదాస్పదంగా మారిన కొన్ని అంశాల్లో ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించినట్లు హమాస్‌ ప్రతినిధి ఏఎఫ్‌పీ మీడియాతో వెల్లడించారు. దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. కాల్పుల విరమణ షరతులు, గాజా నుంచి బలగాల ఉపసంహరణ విషయంలో వారు ఇప్పటి వరకు నిర్దిష్ట విధానాన్ని తెలియజేయలేదని పేర్కొన్నారు. మరోవైపు గాజా నుంచి వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. ఇది అసంబద్ధమైన డిమాండ్‌ అని కొట్టిపారేశారు.

మరోవైపు హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై (Israel Hamas cease fire) జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు వైనెట్‌ మీడియాతో తెలిపారు. సైనిక, నిఘా సంస్థల అధికారులు ఒప్పందంపై చర్చల కోసం ఖతర్‌ వెళ్లినట్లు ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది. నవంబరులో వారంపాటు కుదిరిన ఒప్పందాన్ని పర్యవేక్షించిన ఖతర్‌ ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-థానీ తాజా చర్చల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన హమాస్‌ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

గాజాలోని రఫాలో భూతల పోరుకు సంబంధించిన ప్రణాళికను సైన్యం అందజేసిందని బెంజమిన్‌ సోమవారం తెలిపారు. ప్రస్తుతం రఫాలో 14 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఇబ్బంది కలగకుండా పోరు ఎలా సాగించాలనేది కేబినెట్‌లో చర్చించామని నెతన్యాహు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని