Joe Biden: మళ్లీ మరచిపోయిన బైడెన్‌.. ఈసారి ‘వైస్‌ ప్రెసిడెంట్‌’

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి గందరగోళానికి గురయ్యారు. కరోనా కాలంలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆ టైంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేశానంటూ మాట తుళ్లారు.

Published : 21 May 2024 15:36 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఇటీవల మాటలపై నియంత్రణ కోల్పోయిన సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన మరోసారి గందరగోళానికి గురయ్యారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న బైడెన్‌.. కరోనా కష్టకాలం గురించి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తాను దేశ ఉపాధ్యక్షుడిగా పని చేసినట్లు భ్రమించారు. వాస్తవానికి ఆ సమయంలో రిపబ్లికన్ పార్టీ నేత మైక్ పెన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

‘‘కరోనా సమయంలో ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ పరిస్థితులు ఎంతో చెడ్డవి. నాడు నేను ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నా. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. డెట్రాయిట్ వెళ్లి అక్కడి సమస్యలను పరిష్కారించాలంటూ నన్ను ఆదేశించారు’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే, అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌.. మైక్‌ పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. ఈ విషయాన్ని మరచిపోయిన బైడెన్‌ తానే ఆ పదవిలో ఉన్నట్లు చెప్పుకోవడం గమనార్హం. ఆయనకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.

‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా

బైడెన్‌.. ఒక పేరుకు బదులు మరో పేరు ప్రస్తావించి గందరగోళం సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇరాక్‌తో జరుగుతున్న యుద్ధంలో అతడు (పుతిన్‌) ఓడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని మాట తుళ్లారు. అదే సమయంలో ఆయన భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీరు నా కొత్త స్నేహితుణ్ని చూసే ఉంటారు. ప్రపంచంలో చిన్న దేశం ప్రధాని ఆయన.. కానీ ఇప్పుడదే పెద్ద దేశమైన చైనా.. కాదు క్షమించండి.. అది భారత్‌’ అంటూ సరిదిద్దుకున్నారు.

వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జో బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి లేదని అందులో పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను మాత్రం బైడెన్‌ తీవ్రంగా ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు