Ebrahim Raisi: ‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది.

Updated : 21 May 2024 12:46 IST

వాషింగ్టన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ‘రైసీ చేతులు రక్తంతో తడిశాయి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. అనేక అణచివేతల్లో ఆయన హస్తం ఉందని పేర్కొంది. పరోక్షంగా అనేక హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు పేర్కొంది.

‘‘ఈ (ఇబ్రహీం రైసీ) వ్యక్తి చేతులు రక్తంతో తడిశాయి. ఇరాన్‌లో (Iran) హక్కుల అణచివేతలో ఆయన పాత్ర ఉంది. హమాస్‌ సహా అనేక తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలిచారు. సాధారణంగా ఎవరు మరణించినా మేం విచారం వ్యక్తం చేస్తాం. అలాగే ఆయన మృతి పట్ల కూడా సంతాపం తెలియజేస్తున్నాం’’ అని అగ్రరాజ్య జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ అన్నారు. రైసీ న్యాయవ్యవస్థలో పనిచేసిన సమయంలో అనేక మంది రాజకీయ ఖైదీలకు మరణశిక్షలు అమలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అధ్యక్ష హోదాలో ఉండగా.. హక్కుల కోసం పోరాడిన మహిళలపై కర్కష వైఖరి అవలంబించారని చెబుతుంటారు.

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం

ఇరాన్ మా సాయం కోరింది..

అంతకుముందు రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా సంతాప ప్రకటన వెలువరించింది. ప్రాథమిక, మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఇరాన్‌ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని పేర్కొంది. మరోవైపు కూలిన హెలికాప్టర్‌ జాడను కనిపెట్టేందుకు ఇరాన్‌ తమ సాయం కోరిందని శ్వేతసౌధం అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ వెల్లడించారు. అందుకు తాము సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ.. వివిధ కారణాల వల్ల వెంటనే స్పందించలేకపోయామని తెలిపారు.

మా హస్తం లేదు..

మరోవైపు హెలికాప్టర్‌ ప్రమాదంలో అమెరికా కుట్ర ఏమీ లేదని రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. కచ్చితంగా ఇరాన్‌ దీనిపై విచారణ చేస్తుందని.. దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు. ఈ దుర్ఘటన వల్ల పశ్చిమాసియా ప్రాంతంలో కొత్తగా ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని అనుకోవడం లేదన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని