Biden-Trump: ట్రంప్‌ గెలవకూడదని ప్రపంచ నేతలు కోరారు: బైడెన్‌

Biden-Trump: వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను గెలవనివ్వొద్దని ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేశాధినేతలు తనకు చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు.

Published : 30 Mar 2024 19:24 IST

న్యూయార్క్‌: ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ల మధ్య గట్టి పోటీనే ఉంది. దీంతో ఇరువురు నేతలు ప్రచార జోరు పెంచారు. ఈక్రమంలోనే అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ గెలవకూడదని ప్రపంచ నేతలు తనతో చెప్పారని అన్నారు. అలా జరిగితే ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరమని వారు భావిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రచారం కోసం న్యూయార్క్‌లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ పాల్గొన్నారు. ‘‘నవంబరులో తాను ఓడిపోతే రక్తపాతమే అని ట్రంప్‌ చెబుతున్నారు. ఇది అత్యంత ఆందోళనకర అంశం. ఈ మధ్య నేను ఏ దేశాధినేతను కలిసినా వారు ఒకటే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను (ట్రంప్‌) గెలవనివ్వకండి అని అడుగుతున్నారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులోనూ దాదాపు ప్రతీ ప్రపంచ నేత ఇదే కోరారు. ఆయన గెలిస్తే వారి ప్రజాస్వామ్యాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు’’ అని అగ్రరాజ్య అధినేత వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా రెండు వేల బాంబులు

‘‘నాటో కూటమి నుంచి ట్రంప్‌ దూరంగా వచ్చారు. ఏమైనా చేసుకోండి అంటూ పుతిన్‌ను రెచ్చగొట్టారు. ఆయన తీరుతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతోంది. నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాకపోవచ్చు. కానీ ట్రంప్‌ను మాత్రం కాదు కదా..! అందుకే ప్రపంచదేశాలు నాపై భరోసా ఉంచాయి. నాకు గౌరవం ఇస్తున్నాయి’’ అని బైడెన్‌ తెలిపారు. ఈ-విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని