Joe Biden: గాజాలో ఆకలి కేకలు.. బైడెన్‌ కీలక నిర్ణయం

గాజావాసులు ఆకలితో నరక యాతన అనుభవిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి మిలటరీ విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను ఎయిర్‌డ్రాప్‌ చేయనున్నట్లు తెలిపారు.

Updated : 02 Mar 2024 16:25 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో గాజా (Gaza)లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న అమాయకులపై ఐడీఎఫ్‌ కాల్పులు జరపడం యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామని అధ్యక్షుడు బైడెన్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరం. అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘రెడీ టూ మీల్స్‌’ ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా ఎయిర్‌డ్రాప్‌ చేయనుంది. ఈ ఆహార పంపిణీ నిరంతర ప్రక్రియ అని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జోర్డాన్‌, ఫ్రాన్స్‌ సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలోకి ఆహార పొట్లాలను జారవిడిచాయి.

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

మానవతా సాయం ఫలాలు అందరికీ అందాలంటే గాజా-ఈజిప్ట్‌ సరిహద్దులోని రఫా చెక్‌పోస్టు తెరుచుకుంటేనే అది జరుగుతుందని.. లేదంటే ఈ చర్య అంతగా ప్రభావం చూపకపోవచ్చని మరొక అమెరికా అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. గురువారం తెల్లవారుజామున మానవతా సాయం కోరుతూ ట్రక్కుల వద్ద గుమిగూడి ఉన్న వారిపై ఇజ్రాయెల్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు.

చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని ఐరాస అందోళన వ్యక్తం చేస్తోంది. ఆహార కొరత ఏర్పడి రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు. ఆకలికి తాళలేక పశువుల దాణానే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్‌ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ, జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే గాజాలోకి ప్రవేశించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని