Biden: హమాస్‌, రష్యా.. రెండూ ఒకటే: బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

Biden: ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌కు అండగా ఉండటం.. అమెరికా ప్రయోజనాలకు అత్యంత కీలకమని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. హమాస్‌, రష్యాను ఎన్నటికీ గెలవనివ్వబోమని చెప్పారు.

Updated : 20 Oct 2023 13:49 IST

వాషింగ్టన్‌: తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ (Israel), ఉక్రెయిన్‌ (Ukraine)కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఓవల్‌ ఆఫీసు నుంచి దేశ ప్రజలనుద్దేశిస్తూ ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా హమాస్‌ (Hamas), రష్యా (Russia)పై విరుచుకుపడ్డారు. హమాస్‌, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఒక విషయంలో ఆ రెండింటి ఎజెండా ఒకటే అన్నారు. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే వారి లక్ష్యమని దుయ్యబట్టారు. ఆ ముప్పులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడం.. అమెరికా ప్రయోజనాలకు కీలకమని స్పష్టం చేశారు.

‘‘ఓ గొప్ప దేశంగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు చిన్నపాటి రాజకీయ విభేదాలు అడ్డు కాకూడదు. హమాస్‌ లాంటి ఉగ్రవాదులు, పుతిన్‌ లాంటి నియంత శక్తులను మనం గెలవనివ్వకూడదు. హమాస్‌, పుతిన్‌ పాల్పడే బెదిరింపులు భిన్నమైనవి కావొచ్చు. కానీ వారి ఎజెండా ఒకటే. పొరుగు ప్రజాస్వామ్యాలను పూర్తిగా నాశనం చేయాలనే వారు కోరుకుంటున్నారు. ఇలాంటి దురాక్రమణలు కొనసాగేందుకు మనం అనుమతిస్తే.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆ ఘర్షణలు వ్యాపిస్తాయి’’ అని బైడెన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

వెన్నుపోటు పొడిస్తే మనకే నష్టం..: బైడెన్‌

‘‘అమెరికా నాయకత్వం ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపింది. మిత్రదేశాల వల్లే అమెరికా సురక్షితంగా ఉంటుంది. మన విలువలు, విధానాల వల్లే భాగస్వాములు మనతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఉక్రెయిన్‌కు సాయం చేయకుండా దూరంగా జరిగితే.. ఇజ్రాయెల్‌కు వెన్నుపోటు పొడిస్తే.. వాటన్నింటినీ ప్రమాదంలో పడేసినట్లే. అది సరైంది కాదు’’ అని బైడెన్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్, తైవాన్‌ వంటి దేశాలకు ఆర్థిక సహకారం, మానవతా సాయం, సరిహద్దుల నిర్వహణ కోసం 100 బిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు బైడెన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ భారీ విరాళాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరారు. ‘‘ఈ యుద్ధాల్లో ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్ గెలిచేలా మనం అండగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు అత్యంత కీలకం. ఈ చిన్న సాయం.. తర్వాతి తరాల అమెరికన్ల భద్రతకు మూలమవుతుంది. అమెరికాను ప్రపంచ లీడర్‌గా నిలబెడుతుంది’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

హమాస్‌తో పోరు నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించేందుకు బైడెన్‌ ఇటీవల ఆ దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన మరుసటి రోజే ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగానికి ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మాట్లాడినట్లు వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. ఇక, ఓవల్‌ ఆఫీసు నుంచి బైడెన్‌ ప్రసంగించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. గతంలో అమెరికాను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్‌ బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఓవల్‌ ఆఫీస నుంచి ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు