Lawrence Bishnoi: కెనడాలో భారత పారిశ్రామికవేత్త హత్య.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పనే

Eenadu icon
By International News Team Updated : 29 Oct 2025 10:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా (Canada)లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ విధ్వంసం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇటీవల ఆ దేశంలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్‌ సింగ్‌ సహాసి (Darshan Singh Sahasi) హత్యకు గురయ్యారు. దర్శన్‌ను తామే చంపామని తాజాగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (gangster Lawrence Bishnoi) అంగీకరించింది. 

ఈ మేరకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో సభ్యుడైన గోల్దీ ధిల్లాన్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. సహాసి మాదకద్రవ్యాల వ్యాపారంలో భాగమయ్యాడని ఆరోపించాడు. అతని వద్ద నుంచి తాము డబ్బు డిమాండ్‌ చేశామని.. అది అందకపోవడంతో చంపేశామని పేర్కొన్నాడు. అధికారుల వివరాల మేరకు... సోమవారం అబోట్స్‌ఫోర్డ్‌లోని సహాసి (66) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామికవేత్త తన ఇంటి వెలుపల ఉన్న కారు వద్దకు వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మరో కారులో దుండగుడు వేచి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాల్పుల అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికే సహాసి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తామే ఈ హత్య చేశామని ప్రకటించడం గమనార్హం. 1991లో సహాసి కెనడాకు వెళ్లారు. తొలుత చిన్న ఉద్యోగిగా పనిచేసిన ఆయన.. తర్వాత నష్టాల్లో ఉన్న ఓ వస్త్ర యూనిట్‌లో వాటా సంపాదించారు. తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. సహాసి హత్య నేపథ్యంలో కెనడాలో భారతీయుల భద్రతపై మరోసారి చర్చ మొదలయ్యింది. 

పంజాబీ గాయకుడే లక్ష్యంగా కాల్పులు.. 

ఇదిలాఉండగా.. కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్‌  (Chani Nattan) ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. దీనికి కూడా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బాధ్యత వహించింది. గోల్దీ ధిల్లానే సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. నట్టన్‌తో తమ గ్యాంగ్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్నాడు. అయితే, గాయకుడు సర్దార్‌ ఖేరాతో నట్టన్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం వల్లే అతన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడినైనా తాము లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించాడు. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారత్‌తోపాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఈ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఇటీవల కెనడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ గ్యాంగ్‌ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆ గ్యాంగ్‌ను ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

Tags :
Published : 29 Oct 2025 09:56 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు