Brazil: బ్రెజిల్‌లో భారీ ఆపరేషన్‌.. 64 మంది మృతి

Eenadu icon
By International News Team Updated : 29 Oct 2025 08:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రెజిల్‌ (Brazil)లోని రియో డి జనీరో (Rio de Janeiro)లో రెడ్ కమాండ్ ముఠా లక్ష్యంగా భద్రతా బలగాలు పెద్దఎత్తున ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో అధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలోని అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల్లో రెడ్‌ కమాండ్‌ ఒకటి. ఈ గ్రూపును లక్ష్యంగా చేసుకునేందుకు దాదాపు ఏడాది పాటు ప్రణాళిక రచించినట్లు భద్రతాధికారులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 2,500 మంది సాయుధ బలగాలు పాల్గొన్నాయని వెల్లడించారు. కొన్ని గంటల పాటు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతాధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.  75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రియో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్‌గా అభివర్ణించారు. దాడుల సమయంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు తెలిపారు.

ఆపరేషన్‌కు ప్రతీకారంగా.. అధికారులే లక్ష్యంగా దాడి చేసేందుకు ముఠాలు డ్రోన్‌లు ఉపయోగించాయని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. వారిపై దాడులు జరిపినా భద్రతా బలగాలు వెనక్కి తగ్గకుండా ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయని వెల్లడించింది. సాయుధ బలగాలు చేసిన ఈ హింసాత్మక ఘటనను పలు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ బ్రెజిల్‌ డైరెక్టర్‌ సీసార్‌ మయోజన్‌ మాట్లాడుతూ.. ఈ హింసాత్మక ఘటన పెద్ద విషాదకరమన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం కూడా ఖండించింది. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసిందంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది.  

Tags :
Published : 29 Oct 2025 07:49 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని