Israel Hamas: హమాస్‌ చర్యల వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా

Israel Hamas Conflict: ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య మళ్లీ పోరు మొదలైంది. ఇందుకు హమాస్‌ కారణమని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated : 02 Dec 2023 11:13 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel-Hamas) మధ్య సంధి గడువు ముగిసిపోవడంతో గాజాలో మళ్లీ బాంబులు పేలుతున్నాయి. కాల్పుల విరమణ కోసం కుదిరిన ఒప్పందం నిలిచిపోవడానికి హమాస్ చర్యలే కారణమని అమెరికా(USA) నిందించింది. అది ఒప్పందాన్ని గౌరవించకుండా, ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించింది.

ఒప్పందం నిబంధనలను హమాస్ ఉల్లంఘించడం వల్లే మళ్లీ పేలుళ్లు మొదలయ్యాయని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) అన్నారు. జెరూసలెంలో జరిగిన దాడిని, సంధి ముగియకముందే హమాస్‌ వైపు నుంచి రాకెట్లు దూసుకురావడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విరామం ఎందుకు ఆగిపోయిందో అందరూ అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు. ‘కాల్పుల విరమణ గడువు ముగియడానికి ముందే హమాస్ దారుణమైన ఉగ్రదాడికి పాల్పడింది. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడగా.. అందులో అమెరికన్లు ఉన్నారు. అంతేగాకుండా మిలిటెంట్లు  రాకెట్లను పేల్చారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలన్నదే అమెరికా ఉద్దేశం. బందీల విడుదలపైనే మా దృష్టంతా ఉంది. అలాగే ఇజ్రాయెల్‌కు, అక్టోబర్ 7 లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ దేశం చేసే ప్రయత్నాలకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాం’ అని తెలిపారు.

ఎనిమిది అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనండి.. రష్యన్‌ మహిళలకు పుతిన్‌ విజ్ఞప్తి

అక్టోబర్‌ 24న ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel-Hamas) మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం  జరగడంతో వారం రోజుల పాటు దాడులు చోటుచేసుకోలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. ఈ గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. కాల్పుల విరమణను ఇంకా కొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. హమాస్‌ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌  వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుదల ఆగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని