china: భారత్‌తో సరిహద్దు వివాదం మా ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించదు: చైనా

భారత్‌తో సంబంధాలను కేవలం సరిహద్దు వివాదం దృష్టితోనే చూడలేమని చైనా అభిప్రాయపడింది. పరస్పర విశ్వాసం పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. 

Published : 14 Mar 2024 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌తో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలను పూర్తిగా ప్రతిబింబించదని చైనా (china) పేర్కొంది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ దీనిని వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుకొనేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో బలగాల మోహరింపు వల్ల ఇరు పక్షాలకు ఉపయోగం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై వెన్‌బిన్‌ మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు వివాదానికి తగిన స్థానం ఇవ్వాలన్నారు. 

‘‘సరిహద్దు వివాదం వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడమే ద్వైపాక్షిక ప్రయోజనాలను కాపాడుతుందని ఇరు దేశాలు బలంగా నమ్ముతున్నాయి. భారత్‌-చైనా మధ్య ఉన్న ఒప్పందాలు,  నాయకుల మధ్య అవగాహనను ఉభయపక్షాలు కొనసాగిస్తాయని నమ్ముతున్నాను. దౌత్య, సైనిక మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలి. సరిహద్దు వివాదంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి. పరస్పర విశ్వాసం పెంచుకొని అపోహలను తొలగించుకోవాలి. సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేసుకొని సహకరించుకోవాలి. అడ్డంకులను సృష్టించకుండా చూసుకోవాలి’’ అని వాంగ్‌ పేర్కొన్నారు.  ఈ విషయంలో భారత్‌ కూడా చైనాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌ నౌక హైజాక్‌

ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాట్లాడుతూ ‘‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను అమలును పర్యవేక్షించుకోవడం సమష్టి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్లుగా చూస్తున్న ఉద్రిక్తతల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు’’ అని వ్యాఖ్యానించారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో చోటుచేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు. టోక్యోలో అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన రైసినా రౌండ్‌టేబుల్‌ ప్రారంభ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై నేడు చైనా ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని