Rishi Sunak: రిషి సునాక్‌ అమెరికా వెళ్లిపోతారా..! ఆయన ఏమన్నారంటే..?

బ్రిటన్‌ ఎన్నికల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయే ప్రణాళికల్లో ఉన్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ప్రధాని రిషి సునాక్‌ ఖండించారు.

Published : 29 May 2024 00:06 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం విడిచి వెళ్లిపోయే ప్రణాళికల్లో ఉన్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఖండించారు. బ్రిటనే (Britain) తన ఇల్లు అని, ఎన్నికల తర్వాత తన కుటుంబాన్ని అమెరికా (USA)కు తరలించే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.

అధికార ‘కన్జర్వేటివ్‌ పార్టీ’ని బాగుచేయలేనంత స్థాయిలో దెబ్బతీసిన ప్రధాని రిషి సునాక్‌.. కొన్ని వారాల్లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లిపోవాలని ప్రణాళికలు రచిస్తున్నారని అదే పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి జాక్‌ గోల్డ్‌స్మిత్‌ ఇటీవల ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. ఇదికాస్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, ఎన్నికల నేపథ్యంలో అమెర్‌శామ్‌లో నిర్వహించిన ప్రచారంలో భాగంగా సునాక్‌ ప్రసంగిస్తూ.. ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

ఎన్నికలపై రిషి సునాక్‌ ప్రకటన.. సతీమణి అక్షతా మూర్తి పోస్ట్‌ వైరల్‌

‘‘గోల్డ్‌స్మిత్‌తో చాలా రోజులుగా మాట్లాడలేదు. కానీ, మా కుటుంబ విషయాల గురించి అవగాహన ఉన్నట్లు ఆయన చెప్పడం పట్ల ఆశ్చర్యపోయాను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈ దేశమే నా ఇల్లు. సౌతాంప్టన్‌లో పుట్టి పెరిగాను. స్థానిక సమాజానికి సేవ చేయాలనే విలువలకు కట్టుబడి ఉన్నాను. అదే చేస్తూ వచ్చాను. నా ఇద్దరు కుమార్తెలు ఇక్కడే చదువుకుంటున్నారు. నా కుటుంబాన్ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించే ఉద్దేశం లేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగా సెయింట్ మేరీస్ స్టేడియంలో సౌతాంప్టన్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మ్యాచ్‌లు చూస్తూ సంతోషంగా ఇక్కడే గడపాలనుకుంటున్నా’’ అని తెలిపారు.

జులై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఇటీవల ప్రకటించారు. బ్రిటన్‌ ప్రజలకు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు