Rishi Sunak: ఎన్నికలపై రిషి సునాక్‌ ప్రకటన.. సతీమణి అక్షతా మూర్తి పోస్ట్‌ వైరల్‌

Rishi Sunak - Akshata Murty: యూకే సార్వత్రిక ఎన్నికలపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటన చేయగానే సతీమణి అక్షతా మూర్తి ఓ పోస్ట్‌ చేశారు. తన భర్త కోసం పవర్‌ఫుల్‌ మెసేజ్‌ పంచుకున్నారు.

Published : 23 May 2024 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ (UK General Elections) పౌరులు జులై 4న తమ దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. దీనిపై ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) బుధవారం అనూహ్య ప్రకటన చేసి ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషి సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ చేశారు. భర్తతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నీ ప్రయాణంలో వేసే ప్రతీ అడుగులో నేను నీ వెంటే ఉంటా’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల (Britain Elections) తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధాని స్వయంగా తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ.. తన అధికారిక నివాసమైన ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. వాస్తవానికి ఈ ఎన్నికలు ఏడాది చివర్లో ఉంటాయని అంతా భావించారు. ఈ ఊహాగానాలకు భిన్నంగా ముందుగానే రిషి ఎన్నికలకు వెళ్తుండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది.

నా ఓటు ఆయనకే..: నిక్కీ హేలీ

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వస్తోంది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు