British Museum: 256 ఏళ్ల బ్రిటిష్‌ మ్యూజియం చరిత్రకు మచ్చ.. 1,800 పురాతన వస్తువుల చోరీ!

British Museum: లండన్‌లోని ప్రఖ్యాత బ్రిటిష్‌ మ్యూజియంలో 1,800 వస్తువులు చోరీకి గురైనట్లు నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.

Updated : 27 Mar 2024 10:22 IST

లండన్‌: ప్రఖ్యాత బ్రిటిష్‌ మ్యూజియంలో (British Museum) దాదాపు 1,800 పురాతన వస్తువులు చోరీకి గురైనట్లు దాని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. సంరక్షణాధికారి పీటర్‌ హిగ్స్‌ వాటిని అపహరించి ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపించారు. అతణ్ని 2023 జులైలోనే విధుల్లో నుంచి తొలగించారు. దాదాపు దశాబ్దకాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు సహా ఇతర వస్తువులను మాయం చేసి హిగ్స్‌ తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసినట్లు దావాలో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి హీథర్ విలియమ్స్.. నాలుగు వారాల్లోగా తన దగ్గర ఉన్న వస్తువులను మ్యూజియానికి అప్పజెప్పాలని హిగ్స్‌ను ఆదేశించారు. ‘ఈబే’, ‘పేపాల్‌’ ఖాతాల్లోని లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 356 వస్తువులను రికవరీ చేసినట్లు మ్యూజియం అధికారులు కోర్టుకు వెల్లడించారు. అపహరణకు గురైనవన్నీ చారిత్రక, సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యం ఉన్న వస్తువులని తెలిపారు. నకిలీ పత్రాలను సృష్టించి మ్యూజియం రికార్డులను తారుమారు చేయడం సహా తన పేరు మార్చుకొని హిగ్స్‌ వాటిని విక్రయించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

ఆ తండ్రికి రూ.వందల కోట్ల ఆస్తి..సామాన్యుడిలా పెరిగిన కుమారుడు

మ్యూజియం (British Museum)లోని గ్రీస్‌, రోమ్‌ విభాగాల్లో దాదాపు రెండు దశాబ్దాలు పనిచేసిన హిగ్స్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అనారోగ్యం కారణంగా మంగళవారం విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అపహరణపై పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు వారు హిగ్స్‌పై ఎలాంటి నేరాభియోగాలను మోపలేదు. చోరీ విషయం వెలుగులోకి వచ్చిన ఆగస్టులోనే మ్యూజియం డైరెక్టర్‌ హార్ట్‌విగ్ ఫిషర్ రాజీనామా చేశారు. ఈబేలో మ్యూజియం కలెక్షన్‌ విక్రయానికి ఉన్నట్లు ఓ చరిత్రకారుడు హెచ్చరించినప్పటికీ తాను ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయానని క్షమాపణలు చెప్పారు.

ఈ చోరీ ఉదంతం వల్ల 256 ఏళ్ల మ్యూజియం (British Museum) చరిత్రకు మచ్చ ఏర్పడిందని ఛైర్మన్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ జార్జ్ ఒస్బోర్న్ అన్నారు. సెంట్రల్ లండన్‌లోని బ్లూమ్స్‌బరీ జిల్లాలో ఉన్న ఈ మ్యూజియాన్ని 18వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. ఈజిప్టు మమ్మీలు, పురాతన గ్రీకు విగ్రహాల నుంచి 12వ శతాబ్దపు చైనీస్ కవిత్వంతో కూడిన శాసనాలు, కెనడాలో స్థానిక ప్రజలు తయారు చేసిన మాస్క్‌ల వరకు వేలాది చారిత్రక వస్తువులు ఇక్కడ ఉన్నాయి. బ్రిటన్‌లోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాల్లో ఇదొకటి. ఏటా దాదాపు 60 లక్షల మంది సందర్శిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు