రహస్యంగా రూ.వందలకోట్ల ఆస్తి.. కుమారుడికి తెలియకుండా దాచిన తండ్రి..!

కుమారుడికి తెలియకుండా ఓ తండ్రి రూ.వందల కోట్ల ఆస్తిని దాచిపెట్టాడు. ఎందుకంటే..?

Updated : 26 Mar 2024 12:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా ఉంచాడో తండ్రి. 20 ఏళ్లు వచ్చిన తర్వాతే తమ సంపద గురించి అతడికి వెల్లడించాడట. ఏటా రూ. 690 కోట్ల విలువైన వ్యాపారం చేసే మాలా ప్రిన్స్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకుడి (multimillionaire in China) కుటుంబ కథ ఇది..!

చైనా (China)లో ప్రముఖ బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాకుడు జాంగ్‌ యుడాంగ్‌. ఆయన కుమారుడు జాంగ్ జిలాంగ్‌. అతడు మీడియాతో మాట్లాడుతూ ఓ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు.  ‘‘నాకు 20 ఏళ్లు వచ్చేవరకు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి నా తండ్రి అబద్ధం చెప్పారు. మా నాన్న స్థాపించిన ఈ బ్రాండ్ గురించి తెలిసినప్పటికీ, వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారు. పింగ్‌జియాంగ్ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో నా జీవితం సాగింది. కుటుంబం పేరు ఉపయోగించకుండానే నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. గ్రాడ్యుయేషన్ తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలనుకొన్నాను. అయితే గ్రాడ్యుయేషన్ సమయంలో మాకున్న సంపద గురించి నాన్న బయటపెట్టారు’ అని వెల్లడించారు. ఈ రహస్యం బయటపడిన తర్వాతే ఆ కుటుంబం రూ.11 కోట్ల విలువైన విల్లాలోకి మారింది. ఒక సాధారణ వ్యక్తిగా పెరిగితేనే.. జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తారనేది యుడాంగ్ అభిప్రాయం. అదే సూత్రాన్ని తన కుమారుడి పెంపకంలో ఉపయోగించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాలా ప్రిన్స్‌లో ఈ కామర్స్ విభాగంలో జిలాంగ్ పనిచేస్తున్నారు. తన పనితీరు నచ్చితేనే సంస్థ బాధ్యతలు కట్టబెట్టడం గురించి ఆలోచిస్తానని తండ్రి చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చెబుతున్నది నమ్మశక్యంగా లేదని, కల్పితంలా ఉందని కామెంట్లు పెట్టారు. మరొకరేమో..‘‘నేను ఈ కథను నమ్ముతున్నాను. ఈ బ్రాండ్ ఇటీవలి కాలంలోనే యాడ్స్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రిన్స్ గ్రాడ్యుయేట్ అవ్వడం వల్లేనేమో’’ అని రాసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని