Canada: కెనడా పర్యటన.. వారికి ‘పోలీస్‌ క్లియరెన్స్‌’పై ప్రభుత్వం క్లారిటీ

కెనడాకు తాత్కాలిక పర్యటన కోసం వచ్చేవారికి.. ఆయా దేశాల నుంచి ‘పోలీస్‌ క్లియరెన్స్‌’ సర్టిఫికెట్‌ అవసరం లేదని ట్రూడో ప్రభుత్వం వెల్లడించింది.

Published : 30 May 2024 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడా వీసా నిబంధనల్లో ఇటీవల వచ్చిన మార్పుల నేపథ్యంలో.. అక్కడికి వెళ్లే విదేశీ పర్యటకులు సమర్పించాల్సిన డాక్యుమెంట్లకు సంబంధించి ట్రూడో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాత్కాలిక పర్యటనకు వచ్చేవారికి ఆయా దేశాల నుంచి ‘పోలీస్‌ క్లియరెన్స్‌’ సర్టిఫికెట్‌ అవసరం లేదని తెలిపింది. దీంతో భారత్‌ సహా అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట కలగనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

పౌరసత్వం, ఇమిగ్రేషన్‌కు సంబంధించి అక్కడి పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ఇటీవల చర్చ జరిపింది. ఈ క్రమంలో తాత్కాలిక వీసాపై వచ్చే విదేశీయుల బ్యాక్‌గ్రౌండ్‌ చెకింగ్‌లపై భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్‌ సభ్యుడు అర్పణ్‌ ఖన్నా పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ సమాధానమిస్తూ.. ‘‘తాత్కాలిక నివాసితులకు అటువంటి సర్టిఫికెట్లు అవసరమని చెప్పలేదు. మేం బయోమెట్రిక్‌ సాయంతో వెరిఫికేషన్‌ చేస్తాం. అయినప్పటికీ.. సెక్యూరిటీ స్క్రీనింగ్‌లో భాగంగా అధికారి అలా చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం అటువంటి సర్టిఫికెట్ల అవసరం ఉండొచ్చు’ అని అన్నారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది ఈతరహా దస్త్రాలు అందించారు? అని అడగగా.. స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు మంత్రి నిరాకరించారు.

కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన.. ఎందుకు?

విదేశీ విధానానికి సంబంధించి ట్రూడో ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటోంది. గృహ వసతుల కొరత, ఆరోగ్య సేవలపై పెరుగుతోన్న ఒత్తిడి నేపథ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల రాకను కట్టడి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా స్థానికుల నుంచి వ్యతిరేకత దృష్ట్యా ఇటీవల ఇమిగ్రేషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని