కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన.. ఎందుకు?

కెనడాలోని ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ ప్రావిన్స్‌లో భారతీయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడి నిబంధనల మార్పుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Published : 25 May 2024 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశీ చదువుల కోసం భారతీయులకున్న గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు కెనడాకి మనదేశం నుంచి విద్యార్థులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని ఆ దేశమూ స్వాగతిస్తుంటుంది. అలాంటిది అక్కడి ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ ప్రావిన్స్‌ పరిస్థితిలో మార్పు వచ్చింది. స్థానికుల నుంచి వ్యతిరేకత దృష్ట్యా ఇటీవల ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో స్థానిక ప్రభుత్వం మార్పులు చేపట్టింది. దీనిపై విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనలపై ఆందోళన దేనికి? అసలు స్థానికుల అభ్యంతరం ఎందుకు?

కెనాడాలోని అతి చిన్న ప్రావిన్స్‌ అయిన ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌లో గత కొంతకాలంగా వలసదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాస్తవంగా చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులు సాధారణంగా ఒంటారియో, బ్రిటీష్‌ కొలంబియా వంటి పేరున్న ప్రావిన్సుల్లోని విద్యా సంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకుంటారు. శాశ్వత నివాసం కోరుకునేవారు మాత్రం పోటీ దృష్ట్యా ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్స్‌ వంటి చిన్న ప్రావిన్సులకు తరలిపోతుంటారు. దీనివల్ల ఇక్కడ వలసదారుల సంఖ్య పెరిగిపోతోంది. దీనిపై కెనడియన్లలో వ్యతిరేకత వ్యక్తమవడంతో తాజాగా ప్రావిన్సియల్‌ నామినీ ప్రోగ్రామ్‌లో స్థానిక ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇందులోభాగంగా హెల్త్‌కేర్‌, చైల్డ్‌కేర్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో ఉన్నవారికే శాశ్వత నివాసం విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఫుడ్‌, రిటైల్‌, సర్వీస్‌ సెక్టార్లలో పనిచేసే విద్యార్థుల పరిస్థితి అనిశ్చితిలో పడింది. అందుకే అక్కడి భారతీయ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.

స్థానికుల అభ్యంతరాలు ఇవీ..

స్టూడెంట్‌ వీసాపై వచ్చి సులువుగా కెనడాలో శాశ్వత నివాసం పొందుతున్నారని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందన్నది స్థానికుల మాట. వలసదారుల వల్ల తమ పిల్లల చదువుల తర్వాత ఉద్యోగాలను అందుకోవడం కష్టమవుతోందని పేర్కొంటున్నారు. దీనికితోడు ఇళ్ల కొరత కూడా మరో కారణం. విదేశీ వలసదారుల వల్ల తమకు ఇళ్లు కూడా దొరకడం లేదన్నది కొందరి వాదన. తమకు వలసదారుల వల్ల వైద్యం సదుపాయాలు కూడా సక్రమంగా అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. స్పెషలిస్ట్ వైద్యుడి అపాయింట్‌మెంట్‌ కోసం సగటున 41.7 వారాలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని