India-Canada: మళ్లీ రెచ్చగొట్టిన కెనడా.. ‘ఎన్నికల్లో విదేశీ జోక్యం’పై దర్యాప్తులో భారత్‌ పేరు

భారత్ విషయంలో కెనడా(Canada) ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తోంది.

Updated : 25 Jan 2024 11:49 IST

ఒట్టావా: భారత్‌ విషయంలో కెనడా (India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తాజాగా ట్రూడో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్‌ పేరును కెనడా చేర్చడమే ఇందుకు కారణం.

తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా(China) యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారత్‌ పేరును ఆ దర్యాప్తులో చేర్చారు. ఈ క్రమంలో 2019, 2021 ఎన్నికల్లో న్యూదిల్లీ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్‌ తమ ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తామని, అలాగే ప్రతిపాదనలు చేస్తామని కమిషన్‌ తెలిపింది. చైనా, భారత్‌తో పాటు రష్యా వంటి దేశాలపైనా కెనడా ఈ ఆరోపణలు చేసింది. కానీ, వీటిని ఆయా దేశాలు ఖండించాయి.

USA-UK: అమెరికా, యూకే మధ్య ‘టీ’ గొడవ..!

ఇక, ఈ కమిషన్‌ మే 3వ తేదీ నాటికి మధ్యంతర నివేదికను సమర్పించనుంది. ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. వాటిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని న్యూదిల్లీ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని