USA-UK: అమెరికా, యూకే మధ్య ‘టీ’ గొడవ..!

USA-UK: టీ ఎలా చేయాలో చెబుతూ అమెరికా ప్రొఫెసర్‌ చేసిన ఓ సూచన యూకేలో తీవ్ర విమర్శలకు దారితీసింది.

Updated : 25 Jan 2024 11:22 IST

లండన్‌: రెండు దేశాల మధ్య వివాదం అనగానే ఏ సరిహద్దు గొడవలో అనుకుంటారు. టీ (Tea) అందుకు కారణమవుతుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ అదే జరిగింది. అమెరికాకు (USA) చెందిన ఓ ప్రొఫెసర్‌ టీ ఎలా చేయాలో చెబుతూ చేసిన సూచన యూకే వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇదీ ప్రొఫెసర్‌ సూచన..

పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కళాశాలలో మిషెల్‌ ఫ్రాంక్‌ రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు టీ (Tea) అంటే చాలా ఇష్టమట. దాన్ని ఎలా తయారు చేయాలో చాలా అధ్యయనం చేశానని స్వయంగా చెప్పారు. అందుకోసం పురాతన గ్రంథాలను సైతం తిరగేశానన్నారు. అనేక పరిశోధన పత్రాలను చదివానని తెలిపారు. చాయ్‌ ప్రేమికురాలిగా, రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా తాను ఓ మంచి మార్గం కనుగొన్నానన్నారు. చక్కగా కుదరాలంటే దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలని సూచించారు. ఇదే విషయాన్ని ఆమె ‘స్టీప్డ్‌: ది కెమిస్ట్రీ ఆఫ్‌ టీ’ అనే పుస్తకంలో రాశారు. అది ఇటీవలే యూకేలో విడుదలైంది.

యూకేలో విమర్శలు..

యూకే (UK) జాతీయ పానీయం తేనీరు. ఉప్పు కలపాలంటూ పుస్తకంలో ఫ్రాంక్‌ చేసిన సూచన యూకే వర్గాలకు ఏమాత్రం రుచించలేదు. పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చాలా మంది ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక కప్పు టీతో ఏమైనా జరగొచ్చంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.

అమెరికా వివరణ..

ఈ వివాదానికి ముగింపు పలకడానికి లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. ‘‘చక్కటి టీ కోసం అమెరికన్ ప్రొఫెసర్ చేసిన సూచన యూకేతో మా బంధాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇది ఇరు దేశాలను కలిపే అమృత పానీయం. ఈ బంధాన్ని సవాల్‌ చేసే ఎలాంటి ప్రతిపాదనలనూ తేలిగ్గా తీసుకోలేం. కప్పు టీలో చిటికెడు ఉప్పు కలపడం మా అధికారిక విధానం కాదు. భవిష్యత్‌లో ఉండదు కూడా’’ అని యూఎస్ స్పష్టం చేయాల్సి వచ్చింది. 

‘కెటిల్‌’లోనే చేయాలి..

అయితే, వివరణ చివరలో ‘‘టీని సరైన మార్గంలో మైక్రోవేవ్‌ ఒవెన్‌లోనే తయారు చేస్తాం’’ అంటూ అమెరికా రాయబార కార్యాలయం చేసిన వ్యాఖ్య మళ్లీ చర్చకు దారితీసింది. ఈసారి బ్రిటన్‌ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఈ పానీయాన్ని కేవలం ‘కెటిల్‌’లో మాత్రమే చేయాలంటూ క్యాబినెట్‌ ఆఫీస్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని