Justin Trudeau: జీ20 సదస్సు సందర్భంగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో..!

జీ20 సదస్సు సందర్భంగా కూడా కెనడా ప్రధాని వ్యవహారశైలి భిన్నంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనకు ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను కూడా వాడుకొనేందుకు ఇష్టపడలేదు. 

Updated : 21 Sep 2023 13:59 IST

దిల్లీ/టొరంటో: జీ20 సదస్సులో (G20 Summit) భాగంగా భారత్‌కు వచ్చిన కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనిపై అప్పట్లో భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెనడా ప్రధాని కోసం భారత ప్రభుత్వం దిల్లీలోని ‘ది లలిత్‌’ హోటల్‌లో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను బుక్‌ చేసింది. కానీ, ఆయన అందులో ఉండేందుకు నిరాకరించారు. దానికి బదులుగా సాధారణ గదిలో బస చేశారని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ భద్రతను పర్యవేక్షించిన ఉన్నతాధికారి ఒకరు జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. 

నిజ్జర్‌ హత్య.. కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలి: అమెరికా

జీ20 సదస్సు అతిథుల కోసం దిల్లీలోని 30 ప్రముఖ హెటళ్లలో గదులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశాధ్యక్షులు, ప్రధానుల కోసం భద్రతా వర్గాల సూచనల మేరకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌లను సిద్ధం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐటీసీ మౌర్య షెరటాన్‌లో, చైనా ప్రధాని లీ చియాంగ్‌ తాజ్‌ ప్యాలెస్‌లో బస చేశారు. సదస్సు ముగిసిన తర్వాత కూడా కెనడా ప్రధాని ఆలస్యంగా స్వదేశానికి బయల్దేరిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న భారత్‌ నుంచి బయల్దేరాల్సి ఉండగా, విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భారత ప్రభుత్వం కెనడా ప్రధాని కోసం ఎయిర్‌ ఇండియా వన్‌ను ఆఫర్‌ చేసింది. అయితే, కెనడా బృందం మాత్రం దీనిని తిరస్కరించి.. తమ విమానంలో తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపింది. 

భారత్‌ హెచ్చరికలను తోసిపుచ్చిన కెనడా 

భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను కెనడా తోసిపుచ్చింది. అన్ని దేశాల ప్రజలకు కెనడా సురక్షితమైందని ఆ దేశ ప్రజా భద్రతా వ్యవహారాల మంత్రి డొమినిక్‌ లెబ్లాంక్‌ అన్నారు. బుధవారం కెనడాలో పర్యటించే, నివసించే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో కొన్నిచోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. అంతకముందు కెనడా ప్రభుత్వం సైతం భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో భారత్‌ సైతం కెనడాలో ఉండే భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని