India-Canada: జీ20కి ముందే భారత్‌ను నిందించాలని.. కెనడా నాడే భంగపాటుకు గురై..!

India-Canada: ఖలిస్థానీ నేత నిజ్జర్‌ హత్యను బహిరంగంగా ఖండించాలని గతంలో కెనడా అమెరికా సహా కొన్ని మిత్రదేశాలను కోరినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు వారు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Published : 20 Sep 2023 11:19 IST

ఒట్టావా: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ (India) హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Canada PM Justin Trudeau) చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే, ఈ వ్యాఖ్యలకు కొద్ది వారాల ముందే కెనడా.. భారత్‌ను నిందించాలని ప్రయత్నించి భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. నిజ్జర్‌ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ఫైవ్ఐ‌స్‌ గ్రూపులోని మిత్రదేశాలను కెనడా కోరిందట. అయితే, అందుకు ఆ దేశాల నుంచి స్పందన కరవైనట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం తాజాగా వెల్లడించింది.

హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (45).. భారత్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జూన్‌ 18న పశ్చిమ కెనడాలోని సర్రే నగరంలో ఒక గురుద్వారా వెలుపల ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు. అయితే, ఈ హత్య వెనుక భారత ఏజెన్సీల పాత్ర ఉందని భావించిన కెనడా.. జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు దిల్లీపై నిందలు మోపాలని ప్రయత్నించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. భారత్‌ తీరును ఖండించేందుకు అమెరికా సహా మిత్రదేశాలు కలిసి రావాలని కోరినట్లు తెలుస్తోంది.

భారత్‌-కెనడా ఢీ అంటే ఢీ.. దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు

జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు ఫైవ్‌ఐస్‌ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ సీనియర్‌ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. ఈ అలయన్స్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకే, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని కెనడా.. ఆ దేశాలను కోరినట్లు తెలిపింది. అయితే, కెనడా వినతిని ఆ దేశాలు తిరస్కరించాయి. ఈ హత్య విషయాన్ని బహిరంగంగా లేవనెత్తేందుకు నిరాకరించినట్లు ఆ కథనం పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు హాజరైన కెనడా.. భారత్ సహా మిత్రదేశాల అధినేతలతో కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీ20 సదస్సు ముగిసిన వారం రోజుల తర్వాత భారత్‌పై ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక, భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్‌ను.. తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని