భారత్‌-కెనడా ఢీ అంటే ఢీ

ఖలిస్థానీ అంశంపై కొంతకాలంగా భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

Published : 20 Sep 2023 06:02 IST

ముదిరిన ఖలిస్థానీ చిచ్చు
దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు

టొరంటో/ దిల్లీ: ఖలిస్థానీ అంశంపై కొంతకాలంగా భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు దేశాలూ పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి. దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ (కేటీఎఫ్‌) నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ఇవి అసంబద్ధ విమర్శలని మన దేశం కొట్టిపారేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో దిల్లీలోని కెనడా హైకమిషన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (45).. భారత్‌లో ‘మోస్ట్‌ వాంటెడ్‌’ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జూన్‌ 18న పశ్చిమ కెనడాలోని సర్రే నగరంలో ఒక గురుద్వారా వెలుపల ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో భారత ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో సోమవారం ఆరోపించారు. ‘‘కెనడా పౌరుడు నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. కొన్ని వారాలుగా మన భద్రతా సంస్థలు దీనిపై వివరాలను సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై మన ఆందోళనలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కెనడా భూభాగంలో జరిగిన ఈ హత్యలో విదేశీ ప్రభుత్వాల ప్రమేయం.. మన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఇది స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య సమాజాలు అనుసరించే ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. తీవ్రమైన ఈ అంశంపై మన మిత్రపక్షాలను సంప్రదిస్తున్నాం. ఈ ఘటనపై దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నా’’ అని ట్రూడో కెనడా పార్లమెంటు దిగువ సభలో పేర్కొన్నారు. అనంతరం కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ స్పందిస్తూ.. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ విభాగం (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌- రా) అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించినట్లు తెలిపారు. తాజా వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సహా పలు దేశాల నేతలతో ట్రూడో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.

దీటుగా స్పందించిన భారత్‌..

ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత ప్రమేయం ఉందంటూ ఆ దేశం అసంబద్ధ, ప్రేరేపిత విమర్శలు చేస్తోంది. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా ట్రూడో ఇలాంటి ఆరోపణలు చేశారు. వాటిని నాడే పూర్తిగా ఖండించాం. చట్టబద్ధ పాలన పట్ల పూర్తి నిబద్ధతను ప్రదర్శించే ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మా డిమాండ్లపై కెనడా ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా ఆ దేశ రాజకీయ నేతలు వేర్పాటువాద శక్తులకు బహిరంగ మద్దతు ఇవ్వడం ఆందోళనకరం. కెనడా భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

అనంతరం.. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌ కామెరూన్‌ మెక్‌కేను దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి మన అధికారులు పిలిపించారు. ఒక సీనియర్‌ కెనడియన్‌ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ఆయనకు తెలియజేశారు. బహిష్కరణకు గురైన దౌత్యవేత్త ఎవరన్నది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆయన కెనడా ఇంటెలిజెన్స్‌ సంస్థ అధికారి ఒలీవియర్‌ సిల్వెస్టర్‌ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఐదు రోజుల్లోగా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భారత్‌ స్పష్టం చేసింది. కెనడా పౌరుడైన హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను ‘ఉగ్రవాది’గా  2020 జులైలో భారత్‌ ప్రకటించింది. దేశంలోని అతడి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జప్తుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని