Canada: నిజ్జర్‌ కేసులో భారత్‌ సహకారంపై దృష్టి: కెనడా

నిజ్జర్‌ హత్యకేసులో భారత్‌పై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నాలను కెనడా మానుకోలేదు. తాము ఇంకా భారత్‌ సహకారం కోసం ఎదురు చూస్తున్నామని తాజాగా మరోసారి వెల్లడించింది.

Updated : 17 Nov 2023 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకేసు దర్యాప్తులో భారత్‌ సహకారం కోసం కృషి చేస్తున్నట్లు కెనడా తెలిపింది. తాజాగా శాన్‌ ప్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ సమావేశంలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మేరి ఈ మేరకు వెల్లడించారు. ‘‘ మా దృష్టి దర్యాప్తుపైనే ఉంది. దానికి సంబంధించి పురోగతి ఉంది. ప్రస్తుతానికి దర్యాప్తు జరిగేలా చూడటంపైనే కెనడా దృష్టి పెట్టింది. కెనడా గడ్డపై కెనడా వాసి హత్యకు గురైతే దర్యప్తు ఎంత కీలకమో మా ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. ఇప్పుడు అది సజావుగా జరిగేట్లు చూడటమే మా లక్ష్యం. దర్యాప్తు జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.

ఇక భారత్‌లో పెట్టుబడులు, వ్యాపారంపై మేరి స్పందిస్తూ.. ‘‘కెనడా వాసులు భారత్‌లో వ్యాపారాలు కొనసాగిస్తారు. వాణిజ్య మంత్రిగా మా పౌరులు, సంస్థలు భారత్‌లో పెట్టే పెట్టుబడులు, వ్యాపారాలకు అవసరమైన సదుపాయాలు కల్పించేలా చేయడమే నా విధి’’ అని పేర్కొన్నారు.

విభేదాలు పరిష్కరించుకోదగ్గవే

బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తన యూకే పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. ఉగ్రవాది నిజ్జర్‌ హత్యకేసులో కెనడా ఇంత వరకు ఎటువంటి ఆధారాలను పంచుకోలేదని ప్రకటించారు. తాజాగా మరో సారి ఆయన స్పందిస్తూ.. తగిన ఆధారాలను కెనడా సమర్పిస్తే విచారణ జరిపేందుకు సిద్ధమేనని పునరుద్ఘాటించారు. బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్‌తో ఆయన చర్చలు జరిపారు. అనంతరం లండన్‌ నుంచి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడడంతో పాటు ‘రాయల్‌ ఓవర్సీస్‌ లీగ్‌’ వద్ద ముఖాముఖిలో పాల్గొన్నారు. తమపై ఆరోపణలు చేసిన కెనడా.. ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. ‘‘భారత్‌ నుంచి ఖలిస్థాన్‌ విడిపోవడాన్ని ప్రోత్సహించేలా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కెనడా రాజకీయాలు ఆస్కారమిచ్చాయి. అలాంటి వ్యక్తులకు కెనడా రాజకీయాల్లో స్థానం కల్పించారు. వాక్‌ స్వాతంత్య్రానికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయి. అవి దుర్వినియోగం అవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం తప్పు. దానిపై బ్రిటన్‌ కూడా అప్రమత్తంగా ఉండాలి. కెనడాలో మా దౌత్యవేత్తల్ని బహిరంగంగా బెదిరించినవారిపై అక్కడి వర్గాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. 

ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌-కెనడా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. భారత్‌ దాదాపు 40 మంది  కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పంపించింది. మరోవైపు కెనడాలోని భారత దౌత్యవేత్తలకు తరచూ బెదిరింపులు వస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు