Canada: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై ఆరోపణల పరంపరను ఆపడంలేదు. తాను చేసిన బహిరంగ ఆరోపణలే భారత్‌ను మరోసారి అటువంటి చర్యకు పాల్పడకుండా అడ్డుకొన్నాయని ఆయన చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 13 Dec 2023 15:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌పై మరోసారి తన అక్కసును కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెళ్లగక్కారు. తమ బహిరంగ ప్రకటనలతో భారత్‌ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో వెనుకడుగు వేసిందని గొప్పలు చెప్పుకొన్నారు. తాను భారత్‌పై చేసిన బహిరంగ ఆరోపణలను సమర్థించుకొనే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో తాను చేసిన ప్రకటన భారత్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారి కెనడాను సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు దోహదపడిందని పేర్కొన్నారు.

కెనడాకు చెందిన సీటీవీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రూడో మాట్లాడుతూ.. నిజ్జర్‌  హత్య కేసుతో భారత్‌కున్న సంబంధాలు మీడియాకు లీకయ్యే అవకాశం ఉండటంతో.. సెప్టెంబర్‌ 18న తానే బహిర్గతం చేశానని చెప్పారు. మొత్తం పరిణామాలపై ప్రభుత్వానికి పూర్తి పట్టుందని కెనడా వాసులకు చెప్పేందుకు ఈ చర్య ఉపయోగపడిందన్నారు. ‘‘కెనడాలో చాలా మంది అభద్రతా భావంతో ఉన్నారు. ముఖ్యంగా బ్రిటిష్‌ కొలంబియాలో నిజ్జర్‌ హత్య తర్వాత సిక్కుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణకు అవసరమైన అన్ని దౌత్య, భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు.. ఇంకో ఘటన చోటు చేసుకోకుండా మరో స్థాయి నిరోధకం ఉండాలని భావించాం. ఈ క్రమంలో వారు (భారత్‌) ఇలాంటి మరో చర్య తీసుకోకుండా అడ్డుకోవాలనుకొన్నాం’’ అని ట్రూడో వివరించారు. వాస్తవానికి ఇప్పటికే ట్రూడో ఆరోపణలను భారత్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. 

హమాస్‌ దళాల జలసమాధి.. గాజా సొరంగాల్లోకి సముద్రపు నీరు..!

ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్‌ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని