Gaza: హమాస్‌ దళాల జలసమాధి.. గాజా సొరంగాల్లోకి సముద్రపు నీరు..!

హమాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ అమలు చేయడం మొదలు పెట్టింది. గాజాలోని సొరంగాల్లో కృత్రిమ వరదను సృష్టించడం మొదలుపెట్టింది.

Updated : 13 Dec 2023 22:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌ దళాలను గాజా సొరంగాల్లోనే జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అమలు చేయడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా గాజా మెట్రోగా పిలిచే హమాస్‌ సొరంగాల్లోకి సముద్రపు నీటి విడుదలను మొదలుపెట్టింది. ఈ ప్లాన్‌ తొలి దశలోనే ఉందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. వీటిల్లో నీరు నింపే ప్రణాళిక పూర్తికావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు. ఈ దెబ్బకు హమాస్‌ దళాలు నక్కిన ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని భావిస్తున్నారు. కాకపోతే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా ఇక్కడి మంచి నీటి వనరులు దెబ్బతింటాయనే అందోళనలు ఉన్నాయి.

ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ సమాజం మద్దతు కోల్పోవడం మొదలైంది: జోబైడెన్‌ కీలక వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌ దళాలు ఈ సొరంగాలను దెబ్బతీయడానికి భారీగా బంకర్‌ విధ్వంసక బాంబుల వినియోగం, రసాయన ద్రవాల వినియోగం, శునకాలను, రోబోలను, డ్రోన్లను పంపడం వంటి అప్షన్లను పరిశీలించాయి. తాజాగా ఐడీఎఫ్‌ చీఫ్‌ హెర్జీ హల్వీ మాట్లాడుతూ సొరంగాలను నీటితో నింపడం మంచి వ్యూహం అని వ్యాఖ్యానించారు. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఇప్పటికే ఐదు భారీ పంపులను గాజా వద్దకు తరలించినట్లు కథనాలొచ్చాయి.

మరోవైపు ఈ వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందిస్తూ ‘‘ఆ సొరంగాల్లో బందీలెవరూ లేరనే వాదనలు ఉన్నాయి. కానీ, నేను దానిని ధ్రువీకరించలేను. ప్రతి పౌరుడి మరణం విషాదకరమే. ఇజ్రాయెల్‌ మాటలకు చేతలకు పొంతన ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

2015లో ఈజిప్ట్‌ కూడా ఇలానే..

గాజా నుంచి ఈజిప్ట్‌లోకి సొరంగాలు తవ్వడం ఇక్కడి వ్యాపారులకు పరిపాటి. 2015లో గాజాపట్టీ-సినాయ్‌ ద్వీపకల్పం మధ్య సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఈజిప్ట్‌ సైన్యం మధ్యధరా సముద్రం నీటిని వీటిల్లోకి వదిలింది. గాజా సరిహద్దుల్లోని సుమారు 14 కిలోమీటర్ల మేర భారీ పైపులతో నీటిని పంప్‌ చేశారు. ఆ తర్వాత ఈ సముద్ర నీటిని చేపల పెంపకానికి వాడారు. ఈ చర్యను అప్పట్లో చాలా పాలస్తీనా గ్రూపులు తీవ్రంగా ఖండించాయి. కానీ, ఆ ప్రాంతంలోని నేల దెబ్బతిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ చర్య లక్షల మంది పాలస్తీనా వాసుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు 2016లో ఓ నివేదిక పేర్కొంది. తాము ఇజ్రాయెల్‌ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఈజిప్ట్‌ అధ్యక్షుడు సిసి అప్పట్లో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని