Canada: ఆ వీడియోపై విచారణ జరుగుతోంది.. ఖలిస్థానీ బెదిరింపులపై కెనడా

ఎయిరిండియా ప్రయాణికులను హెచ్చరిస్తూ.. ఖలీస్థాన్‌ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూ విడుదల చేసిన వీడియోను తీవ్రంగా పరిగణిస్తున్నామని కెనడా ప్రభుత్వం తెలిపింది. దానిపై కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. 

Published : 10 Nov 2023 12:09 IST

ఒట్టావా: ఎయిరిండియా (Air India) ప్రయాణికులను హెచ్చరిస్తూ.. ఖలిస్థానీ (Khalistani) ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్లు కెనడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కెనడా రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్‌ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘‘మేం ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా విమానయాన సంస్థలను హెచ్చరిస్తూ వచ్చిన బెదిరింపులపై కెనడా పోలీసులు విచారణ జరుపుతున్నారు’’ అని రోడ్రిగ్జ్‌ తెలిపారు. ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. దిల్లీ, పంజాబ్‌ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. 

కొద్దిరోజుల క్రితం ఖలిస్థాన్‌ వేర్పాటువాది, ‘సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. అందులో అతను ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర హెచ్చరికలు చేశాడు. నవంబరు 19న ఎయిరిండియా విమానంలో సిక్కులెవరూ ప్రయాణించ్చొద్దని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆ విమానాలను అనుమతించబోమని హెచ్చరించాడు. దాంతోపాటు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని వీడియోలో బెదిరింపులకు పాల్పడ్డాడు.

మరో లష్కరే ఉగ్రవాది హతం.. పాక్‌లో ముష్కరులకు కంటిమీద కునుకు కరవు

ఈ వీడియోను ఉగ్రవాద హెచ్చరికలుగా భారత్‌ పేర్కొంది. దీనిపై విచారణ జరిపి, పన్నూపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. దాంతోపాటు కెనడా-భారత్‌ మధ్య నడిచే విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కెనడా అధికారులకు విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని