Pakistan: పాక్‌ ఉగ్రవాదులకు ‘గుర్తుతెలియని’ భయం.. మరో లష్కరే కమాండర్‌ హతం..!

పాక్‌లో ఉగ్రవాదులు వరుసగా హతమైపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని మట్టుబెడుతున్నారు. 20 నెలల్లో దాదాపు 19 మంది కీలక ఉగ్రకమాండర్లు ఇలా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా లష్కరేకు చెందిన ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు.

Updated : 10 Nov 2023 11:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు అమాయకుల హత్యలకు కుట్రలు పన్ని భయోత్పాతం సృష్టించిన పాక్‌ (Pakistan) ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పాక్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా వారిని హత్య చేస్తుండటంతో.. చాలా మంది రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్నారు. తాజాగా పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రనేత అక్రమ్‌ ఖాన్‌ ఘాజీని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాదాపు 20 నెలల్లో హత్యకు గురైన 19వ ఉగ్రవాది ఇతడు.

ఆసుపత్రివద్ద పోరు

అక్రమ్‌ ఖాన్‌ 2018-2020 మధ్యలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అవసరమైన నియామకాలు చేపట్టేవాడు. గత రెండేళ్లుగా కశ్మీర్‌ లోయలోకి చొరబడుతున్న ఉగ్ర బృందాలకు ఇతడు భారత్‌పై విద్వేషపూరిత పాఠాలు చెబుతున్నాడు. నేడు ఖైబర్‌ పక్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో బజార్‌ జిల్లాలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్రమ్‌ ఖాన్‌ను కాల్చి చంపినట్లు ఆంగ్లపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ఈ విషయాన్ని వీలైనంత వరకు బయటకు రాకుండా చూడాలని పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రయత్నించినట్లు తెలిపింది.

ఈ హత్యతో అప్రమత్తమైన పాక్‌ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక ప్రత్యర్థులు, ఇతర ఉగ్ర గ్రూపుల పాత్ర, లష్కరేలో అంతర్గత విభేదాలు వంటి కోణాలను పరిశీలిస్తున్నారు. గత మూడునెలల్లో లష్కరేకు చెందిన టాప్‌ కమాండర్లు హతం కావడం ఇది రెండోసారి. సెప్టెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఒక మసీదు బయట లష్కరే సీనియర్‌ కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ను కాల్చి చంపారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నియంత్రణలోనే లష్కరే సంస్థ పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ వారంలో హత్యకు గురైన షాహిద్‌ ఖ్వాజా కూడా లష్కరే ఉగ్రవాదే. ఇతడు 2018న భారత్‌లో సుంజ్వాన్‌ సైనిక క్యాంప్‌పై దాడికి సూత్రధారి. 

ఈ వరుస హత్యల్లో ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు కూడా భారీ దెబ్బలు తగిలాయి. గత నెలలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన దావుద్‌మాలిక్‌ను నార్త్‌ వజీరిస్థాన్‌లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఇక హిజ్బుల్‌ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ సన్నిహితడు ముఫ్తీ ఖైజర్‌ ఫారుఖీని కరాచీ నడిబొడ్డున హత్య చేశారు. ఈ ఘటన లష్కరే ఉగ్ర సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐసీ-814 విమానం హైజాక్‌లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీంను కూడా పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చి చంపారు. ఈ వరుస ఘటనలు పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక మే నెలలో ఖలిస్థానీ కమాండో ఫోర్స్‌ అధినేత పరంజీత్‌ సింగ్‌ పన్వార్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు.  జైషే ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడి బృందానికి చీఫ్‌ హ్యాండిలర్‌గా ఉన్న షాహిద్‌ లతీఫ్‌ను అక్టోబర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇతడి బృందమే పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌పై దాడిచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని