India-China: తైవాన్‌ అధ్యక్షుడి పోస్ట్‌కు మోదీ స్పందన.. చైనా కడుపుమంట

India-China: తైవాన్‌ అధ్యక్షుడు చేసిన పోస్ట్‌కు ప్రధాని మోదీ స్పందించడంపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. న్యూదిల్లీపై నోరు పారేసుకుంది.

Published : 06 Jun 2024 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత (India) సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)కి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తైవాన్‌ (Taiwan) నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే కూడా కంగ్రాట్స్‌ చెప్పగా.. ఆ పోస్ట్‌కు మోదీ బదులిచ్చారు. అయితే, దీన్ని చైనా (China) తట్టుకోలేకపోయింది. తైవాన్‌ అధికారుల రాజకీయాలను న్యూదిల్లీ ప్రతిఘటించాలంటూ డ్రాగన్‌ మనపై నోరు పారేసుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందడంపై హర్షం వ్యక్తంచేస్తూ తైవాన్‌ అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌ తే ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు. ‘‘ఈ విజయానికి గానూ నరేంద్రమోదీకి అభినందనలు. మీ నాయకత్వంలో భారత్‌, తైవాన్‌ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత, ఇతర రంగాలపై ఇరు దేశాల సహకారం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని లాయ్‌ రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌కు మోదీ బదులిస్తూ.. ‘‘మీ హృదయ పూర్వక సందేశానికి కృతజ్ఞతలు. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను మేం కోరుకుంటాం. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజనాల కోసం మేం పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే, ఈ సంభాషణలపై బీజింగ్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై న్యూదిల్లీ వద్ద తమ నిరసన వ్యక్తంచేసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు.

‘‘తైవాన్‌ ప్రాంతానికి అసలు అధ్యక్షుడే లేడు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగిఉన్న దేశాలు.. తైవాన్‌ అధికారులతో అధికారిక సంభాషణలు జరపడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రపంచంలో చైనా ఒక్కటే ఉంది. తైవాన్‌ కూడా అందులోని భూభాగమే. తైవాన్‌ అధికారుల రాజకీయాలను భారత్‌ ప్రతిఘటించాలి’’ అని ఆమె అన్నారు.

శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌లో ఇటీవల చైనా వ్యతిరేకి అయిన లాయ్‌ చింగ్‌ తే కొత్త అధ్యక్షుడిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం బీజింగ్‌ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ద్వీపం తమ భూభాగమేనంటూ గత కొన్నేళ్లుగా వాదిస్తున్న డ్రాగన్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడుపడలేదు. దీంతో తైవాన్‌ చుట్టూ భారీఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని