China Ship: మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక..

భారత్‌తో దౌత్య ఉద్రిక్తతల వేళ..  చైనాకు చెందిన ఓ పరిశోధక నౌక మాల్దీవులు రాజధాని మాలె తీరంలోకి ప్రవేశించింది. 

Updated : 22 Feb 2024 11:29 IST

మాలె: భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03 (Xiang Yang Hong 03) మాల్దీవుల (Maldives) జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభిస్తుందని నావికాదళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. 

ఈ నౌక చైనాలోని థర్డ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్రగర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశం. జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరిన ఈ పరిశోధక నౌక తర్వలో మాలె తీరంలో నిలిచి ఉండనుంది. ఇది మరికొన్ని రోజుల్లో తమ జలాల్లోకి ప్రవేశించినుందని.. అయితే ఇది ఎలాంటి పరిశోధనలు నిర్వహించదని మాల్దీవులు గత నెల ప్రకటించింది. అయినప్పటికీ.. ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వారి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అవి మాల్దీవులు, శ్రీలంక మధ్యనున్న జలాల్లో జిగ్‌జాగ్‌ పద్ధతిలో కదలడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

మాఫియా చేతికి అణుబాంబు సామగ్రి.. మయన్మార్‌ కేంద్రంగా అనుమానాలు..!

మాల్దీవులతో దౌత్య ఉద్రిక్తతల వేళ.. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధక నౌక కదలికల్ని భారత్‌ నిశితంగా గమనిస్తోంది. ఇదిలా ఉండగా.. మహ్మద్‌ మయిజ్జు మాల్దీవుల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తక్షణమే తమ గడ్డపై ఉన్న భారత బలగాలు వెళ్లిపోవాలని కోరారు. దీంతో ఈ ఏడాది మే నాటికి భారత్‌ దళాలను ఉపసంహరించుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని