Japan: మాఫియా చేతికి అణుబాంబు సామగ్రి.. మయన్మార్‌ కేంద్రంగా అనుమానాలు..!

అణ్వాయుధాల్లో వాడే పదార్థాలను భారత పొరుగు దేశమైన మయన్మార్‌ నుంచి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో అమెరికా అరెస్టు చేసిన జపాన్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌పై దర్యాప్తు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

Updated : 22 Feb 2024 12:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అణ్వాయుధాల్లో వాడే కీలక పదార్థాల అక్రమ రవాణా మన పొరుగు దేశంలో జరుగుతున్నట్లు అనుమానాలు పెరిగిపోయాయి. అమెరికాలో ఓ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ విషయం బయటపడింది. జపాన్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌ అణుబాంబుకు సంబంధించిన కీలక పదార్థాలనే అక్రమంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అతడిపై నేరాభియోగాలను నమోదు చేసింది. జపాన్‌లో వ్యవస్థీకృత  నేర సిండికేట్‌కు చెందిన టకేషి ఎబిసావను 2022లో డ్రగ్స్‌, ఆయుధ విక్రయాలకు కుట్రపై అరెస్టు చేశారు. ఇతడి గ్రూప్‌ శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, అమెరికాలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. ఇరాన్‌కు చెందిన ఓ ఆర్మీ జనరల్‌తో అణుపదార్థాల డీల్‌ నడిపినట్లు గుర్తించారు. ఇరాన్‌ నుంచి ఆయుధాలకు బదులు తాను అణుసామగ్రిని ఇచ్చేలా ఒప్పందానికి యత్నించినట్లు చేసుకొన్నట్లు తేలింది. 

2020లో టకేషి అమెరికాకు చెందిన డ్రగ్‌ ఎన్‌ఫోర్సెమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండర్‌కవర్‌ ఏజెంట్‌ వద్ద ఒక సారి నోరుజారి తన వద్ద అణుపదార్థాలను సంపాదించే మార్గం ఉందని పేర్కొన్నాడు. వాటిని విక్రయించాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కొనుగోలుదార్లు ఎవరైనా ఉంటే పరిచయం చేయమని సదరు ఏజెంట్‌ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతడు కొన్ని అణు పదార్థాల ఫొటోలను రేడియేషన్‌ కొలతలతో సహా పంపాడు. దీంతో ఏజెంట్‌ తనకు తెలిసిన ఓ ఇరాన్‌ జనరల్‌కు విక్రయించేందుకు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. 

జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

2021లో టకేషి మరోసారి సదరు ఏజెంట్‌ను సంప్రదించాడు. మయన్మార్‌కు చెందిన ఓ వేర్పాటువాద గ్రూప్‌ అణుపదార్థాలను తన ద్వారా ఇరాన్‌ జనరల్‌కు విక్రయిద్దామనుకుంటోందని చెప్పాడు. ఆ సంస్థ ఆధీనంలోని భూమిలో దాదాపు ఐదు టన్నుల అణుపదార్థాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. మయన్మార్‌ నుంచి  థాయ్‌లాండ్‌కు తెప్పించిన అణు పదార్థాల శాంపిల్స్‌ను ఆ ఏజెంట్‌కు చూపించారు. అక్కడ థాయ్‌ అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకొని అమెరికాకు తరలించారు. వాటిని పరీక్షించగా యురేనియం, థోరియం, ప్లుటోనియం ఉన్నట్లు తేలింది. అణుబాంబుల్లో వినియోగించడానికి ప్లుటోనియం అనుకూలంగా ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని